ప్రజలు ఇబ్బందిపడినా పరువాలేదు, కానీ ఇమేజ్ పెరగాలా? హవ్వ!

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒక్కోసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఇదివరకు ప్రభుత్వోద్యోగులు, ఆ తరువాత్ ఆర్టీసీ కార్మికులు మళ్ళీ మొన్న జి.హెచ్.యం.సి. పారిశుద్య కార్మికులు ఒకరి తరువాత ఒకరు తమ జీతాలు పెంచమని కోరుతూ సమ్మె చేయడం, వారిని ఒక వారం పదిరోజులు సమ్మె చేయనిచ్చిన తరువాత వారు అడిగిన దాని కంటే మరొక్క శాతం అధికంగా జీతాలు పెంచి వారి చేతనే మళ్ళీ తనకు చప్పట్లు కొట్టించుకోవడం జేజేలు పలికించుకోవడం కేసీఆర్ కి ఒక అలవాటుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వోద్యోగులు 43శాతం ఫిట్ మెంట్ కోరుతూ ఒకటి రెండు వారాలు సమ్మె చేసిన తరువాత వారికి అదనంగా మరొక్క శాతం ఇచ్చి వారిని మెప్పు పొందే ప్రయత్నం చేసారు. అదే విధంగా ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులను కూడా సమ్మె చేయనిచ్చిన ఆ తరువాత వారికీ జీతాలు పెంచి చప్పట్లు కొట్టించుకొన్నారు. మళ్ళీ తాజాగా జి.హెచ్.యం.సి. పారిశుద్య కార్మికులను కూడా ఒకవారం పది రోజులు సమ్మె చేయనిచ్చి వారు 43 శాతం జీతం పెంపు అడిగితే ఆయన 47.05 శాతం ఇచ్చి చప్పట్లు కొట్టించుకొన్నారు. పైగా తనకు కార్మికులు, ఉద్యోగులు అంటే చాలా అభిమానమని చెప్పుకొన్నారు. అంతే కాదు దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత తెలంగాణా రాష్ట్రమే ధనిక రాష్ట్రమని చెప్పుకొన్నారు. కనుక ఉద్యోగులు, కార్మికులు అడిగిన దానికంటే అధనంగా జీతం పెంచడం చాలా సంతోషించవలసిన విషయమే. ఆయనకి వారిపై అంత అభిమానం ఉన్నందుకూ చాలా సంతోషించాలి.

కానీ తమది ధనిక రాష్ట్రమని, తనకు కార్మికులు, ఉద్యోగులన్నా చాలా అభిమానమని చెప్పుకొంటూనే వారు సమ్మె చేసేంత వరకు ఆయన ఎందుకు జీతాలు పెంచడం లేదు? సమ్మె చేసిన తరువాతనే ఎందుకు పెంచుతున్నారు? వారు సమ్మె చేయడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుందని తెలిసినప్పటికీ వారిని సమ్మె చేయనీయడం, తరువాత వారు అడిగిన దానికంటే ఎక్కువగా జీతాలు పెంచడంలో పరమార్ధం ఏమిటి? వారికి జీతాలు పెంచగలిగే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనేదో ముందే చేసినట్లయితే ప్రజలకి ఇబ్బందులు, ప్రభుత్వానికి నష్టము ఉండదు కదా? తనకు కార్మికులు, ఉద్యోగులన్నా చాలా అభిమానమని చెప్పుకొంటూనే మరో పక్క సమ్మె కాలంలో ప్రభుత్వాన్ని విమర్శించిన కార్మికులను, గురువారం నాటికి విధులలో చేరనివారిని పనిలో నుండి తొలగించాలని జి.హెచ్.యం.సి కమీషనర్ సోమశేఖర్ ని ఆదేశించడంలో అర్ధం ఏమిటి? అనే ధర్మసందేహాలు ఎవరికయినా కలగడం సహజమే.
కార్మికులు, ఉద్యోగులు అడిగినవెంటనే జీతాలు పెంచడం వలన అలుసయిపోతామని కనుక కొంచెం బెట్టు చేయడం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారేమో తెలియదు. వారు అడిగిన దానికంటే ఎక్కువే ఇవ్వడం ద్వారా సమ్మె చేసినపుడు తనని విమర్శించిన వారి చేతనే జేజేలు పలికించుకొంటే ప్రజలలో కూడా తన ఇమేజ్ మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. అంతేకాక ఇక ప్రతిపక్షాలు వారిని ఎంతగా ఎగదోసినా వారిని పట్టించుకోకుండా ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఎల్లప్పటికీ తన మాటే వేదవాక్కులా భావిస్తూ, తనవైపే ఉండేలా చేసుకొనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుంది. ఈవిధంగా చేయడం ద్వారా వారితో ప్రతిపక్షాలకి ఉన్న లంకెని శాశ్వితంగా విడగొట్టడం కోసమే ఆయన ఈ ఎత్తుగడ ఎంచుకొన్నట్లున్నారు.

వారు సమ్మె చేసిన తరువాత ఆయన ఎలాగూ అడిగిన దానికంటే ఎక్కువే జీతం ఇస్తారని రూడీ అయింది కనుక వారి కోసం ప్రతిపక్షాలు రోడ్లమీదకు వచ్చి హడావుడి చేస్తూ ప్రజలని ఆకర్షించే అవకాశం ఉండదు. ప్రతిపక్షాలు వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టే సమయానికి ఆయన హటాత్తుగా సమ్మె చేస్తున్నవారికి జీతాలు పెంచేస్తారు. అప్పుడు ప్రతిపక్షాలే వాళ్ళ ముందు వెర్రివాళ్ళవుతారు. నిన్న సచివాలయంలో ధర్నాకి దిగిన టీ-కాంగ్రెస్ నేతలకి సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురవడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.

ఇక తెలంగాణా సాధన కోసం ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆయనతో సహా తెరాస నేతలు, ఉద్యమకారులు తమ నోటికి ఏవిధంగా పని చెప్పారో అందరికీ తెలుసు. నేటికీ కాంగ్రెస్ నేతలని ఆయన ‘సన్నాసులు’ అనగలుగుతున్నారు. మరి తాము ఇతరులను విమర్శించినప్పుడు నోటికి వచ్చినట్లు దూషించినప్పుడు తప్పులేనప్పుడు, ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదనే ఉక్రోషంతో కొందరు పారిశుధ్య కార్మికులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారిపై కేసీఆర్ ఎందుకు అంత ఆగ్రహం కలుగుతోందో…రెక్కాడితే గాని డొక్కాడని వారిని ఆ తాత్కాలిక ఉద్యోగాలలో నుండి కూడా పీకేయమని ఆదేశించడం చూస్తే తను ఎవరినయినా విమర్శించవచ్చు కానీ తనను తన ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించినా సహించలేనని ఆయన సూచిస్తున్నట్లుంది. ఈ సమ్మెల వలన ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నా, ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలలో, ఉద్యోగులలో తన ఇమేజ్ పెంచుకొనేందుకు, ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఈవిధంగా వ్యవహరించడం ఎవరూ హర్షించలేరు.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com