గుణశేఖర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ తో పాటు డిజాస్టర్స్ కూడా వున్నాయి. అయితే ఏ సినిమా చేసిన అందులో మంచి కథాబలం ఉండేలా చూసుకోవడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు యవతని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్న సినిమా యుఫోరియా. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ట్రైలర్ వదిలారు.
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే.. వారి జీవితం ఏమవుతుంది అనేది యుఫోరియా కథాంశం. అమ్మా నాన్నలు మనతో పాటు.. మన కలల్ని కూడా కంటారనే వాయిస్ తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ఐఏఎస్ కావాలని కలలు కన్న సారా అర్జున్ జీవితాన్ని ఓ పార్టీ ఎలా తలక్రిందులు చేసిందనే పాయింట్ చుట్టూ ట్రైలర్ తిరిగింది. డ్రగ్స్ తో పాటు ఫోక్సో చట్టం ప్రస్తావన కూడా వుంది.
భూమిక తనపై తానే కేసు వేసుకోవడం మరో కీలక పాయింట్. డ్రగ్స్ కి బానిసైన నలుగురు యువకుల ముఠా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడింది, తల్లితండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నారనేది ఆసక్తికరంగా చూపించారు. ఇలాంటి కథలు ఇప్పుడు సమాజానికి అవసరమే. ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచగలిగింది.
