తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టు ట్యాపింగ్ కేసును కొట్టి వేసిందని అంటున్నారు. కక్ష సాధింపుల కోసమే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఇవాళ హరీష్ రావును పిలిచినా.. రేపటి రోజున కేటీఆర్, కేసీఆర్‌లకు నోటీసులు జారీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ట్యాపింగ్ కేసును కొట్టివేశారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి హరీష్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన ట్యాపింగ్ కేసు వేరే.
సిద్ధిపేట వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ 2024లో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావు ఆదేశాల మేరకు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, తనను బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై నమోదైన FIRను సవాలు చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ కేసులో హరీష్ రావుకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని , ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపిస్తోందని పేర్కొంటూ మార్చి 20, 2025న ఆ FIRను కొట్టివేసింది .
కేసును కొట్టేసిన హైకోర్టు – సమర్థించిన సుప్రీంకోర్టు
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. జనవరి 5 జస్టిస్ బి.వి. నాగరత్న , జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఈ కేసును మళ్లీ విచారించడానికి ఎటువంటి కొత్త ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇప్పటికే అన్ని కోణాలను పరిశీలించి, సహేతుకమైన కారణాలతో FIRను కొట్టివేసిందని, ఆ తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో హరీష్ రావుపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల విషయంలో ఆ కేసు విషయంలో మాత్రమే క్లీన్ చిట్ లభించినట్లయింది.
ఇప్పుడు జరుగుతున్న కేసు వేరు !
ఆ కేసును కొట్టివేస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టి వేశారన్న ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత కేసు చాలా సీరియస్ గా మారుతోంది. మొదట పోలీసులు దర్యాప్తు చేసినా.. చాలా క్లిష్టమైన అంశాలు ఉండటంతో సిట్ ను ఏర్పాటు చేశారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ సంచలన విషయాలు బయటపెట్టే దిశగా దర్యాప్తు చేస్తోంది. అందుకే కేటీఆర్ , హరీష్ రావు వీలైనంతగా మిస్లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


