రూ.85 లక్షలా..? రూ.2 వేల కోట్లా..? అసలు నిజమేంటి..?

ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాలపై.. సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరక్ట్ ట్యాక్సెస్ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. రూ.రెండు వేల కోట్లు దొరికాయని ప్రచారం చేయడానికి.. ఓ వర్గం మీడియా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిజానికి… ఆదాయపు పన్నుశాఖ అధికారులు మూడు కంపెనీలతో పాటు.. ఓ వ్యక్తి ఇంట్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నది.. రూ. 85 లక్షల నగదు మాత్రమే. ఆ విషయాన్ని సీబీడీటీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

రూ. 85 లక్షల నగదు.. రూ. 71 లక్షల విలువైన అభరణాలు..!

సీబీడీటీ విడుదల చేసిన లేఖ ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 40 చోట్ల సోదాలు జరిగాయి. రెండు వేల కోట్లకు పైగా అవకతవకలు గుర్తించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి సోదాలు జరిగాయి. ఈ అక్రమ లావాదేవీలు జరిగిన విషయాన్ని ఈ మెయిల్‌, వాట్సాప్‌ సందేశాల ద్వారా గుర్తించారు. బోగస్ కంపెనీలు పెట్టి.. నకిలీ ఇన్వాయిస్‌లతో నగదు చెలామణి చేశారని.. ఓ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరుతో నిధులు సమీకరించినట్లుగా ఆధారాలు దొరికాయి. ఓ ప్రముఖ వ్యక్తికి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ సోదాలు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫ్రా కంపెనీల లావాదేవీలన్నీ.. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు.. కొనుగోళ్లు.. వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. టర్నోవర్ లేని కంపెనీలతో ఈ బోగస్ లావాదేవీలు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కలు చెప్పని 85 లక్షల నగదు.. 71 లక్షల విలువైన ఆభరణాలు.. స్వాధీనం చేసుకున్నాం. ఇరవై ఐదు బ్యాంక్ లాకర్లు సోదాలు చేశారు. ఎక్కడా సోదాలు చేసిన ఇన్ఫ్రా కంపెనీల పేర్లు లేవు. ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పర్సనల్ సెక్రటరీ అనే అన్నారు కానీ.. ఆ ప్రముఖ వ్యక్తి పేరు చెప్పలేదు. కనీసం ఆ సెక్రటరీ పేరు కూడా చెప్పలేదు. సీబీడీటీ తన చట్టాల ప్రకారం.. చెప్పాల్సిన వివరాలను చెప్పింది. గోప్యంగా ఉంచాల్సినవి గోప్యంగా ఉంచింది.

రూ. 2వేల కోట్లు పట్టుబడటం కాదు.. పన్నుల్లేని లావాదేవీలు మాత్రమే..!

కానీ సీబీడీటీ ప్రకటించిన ఈ గోప్యత.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి, ఆ పార్టీ మీడియాకు మరో రకంగా అర్థం అయింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా… ఆ ప్రముఖ వ్యక్తి చంద్రబాబేనని.. ఆయన మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ అని ఆయన ఇంట్లోనే ఐటీ సోదాలు చేసిందని ప్రకటించింది. ఇంత వరకూ చెబితే.. ఓ అర్థం ఉండేదేమో కానీ.. ఆ శ్రీనివాస్ ఇంట్లోనే.. రెండు వేల కోట్లు దొరికాయని.. అవన్నీ చంద్రబాబువేనని.. ప్రచారం ప్రారంభించేశారు. జగన్ మీడియాతో పాటు… అధికార పార్టీలకు సన్నిహితంగా మారిపోయిన కొన్ని మీడియా సంస్థలూ ఈ ప్రచారం చేశాయి. సీబీడీటీ చెప్పిన దాని ప్రకారం… రెండు వేల కోట్లు నగదును.. పన్నులు ఎగ్గొట్టడానికి అక్రమంగా లావాదేవీలు చూపించారు. అంత మొత్తం పట్టుబడిందని చెప్పలేదు. ప్రజల్లో ఏదో ఓ ప్రచారాన్ని చొప్పించాలన్న ఉద్దేశంతో రూ. రెండు వేల కోట్లను ఉధృతంగాప్రచారం చేశారు. మీడియా విలువల్ని పట్టించుకోలేదు.

ఆ మూడు ఇన్ఫ్రా కంపెనీలు ఇవే..!?

ఇందులో ఎక్కడా… ఈ మూడు కంపెనీలు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉన్నాయని కానీ.. ఆ ప్రముఖ వ్యక్తి పర్సనల్ సెక్రటరీకి.. ఈ మూడుకంపెనీలకు సంబంధం ఉందని కానీ చెప్పలేదు. ఐటీ శాఖ..ఓ ఆపరేషన్ చేపట్టింది. దాని ప్రకారం.. మొత్తం నలబై చోట్ల సోదాలు చేసింది. అంత వరకూ చెప్పింది. ఐటీ సోదాలు జరిగిన ఆ మూడు కంపెనీలూ ప్రముఖమైనవే. ఈ ప్రామినెంట్ కంపెనీస్ అని…ఐటీ శాఖే లేఖలో చెప్పింది. మొదటిది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ గురించి..తెలియని తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఉండరు. రెండు రాష్ట్రాల్లోనూ రూ. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రులిద్దరికీ ఆత్మీయుడైన వ్యక్తి మేఘా కృష్ణారెడ్డి. తెలంగాణలో కాళేశ్వరం.. ఏపీలో పోలవరం కాంట్రాక్ట్ ఆయనకే దక్కింది. ఇక రెండో రెండో కంపెనీ ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారిది. బోయినపల్లి శ్రీనివాసరావు అంటే.. టీఆర్ఎస్‌లో తెలియని వారు ఉండరు. ఇక మూడో కంపెనీ షాపూర్జి పల్లోంజీ సంస్థ. ఈ సంస్థకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. దేశంలో.. తొలి తరం కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటి. దేశంలోనే అనేక ఐకానిక్ భవనాలు నిర్మించిన చరిత్ర ఉంది.

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికింది రూ. 2 లక్షలు..!

చంద్రబాబు మాజీ సీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో.. ఐటీ అధికారులు ఐదు రోజుల పాటు సోదాలు చేశారు. ఇది బహిరంగ రహస్యం. ఈ సోదాల్లో పాల్గొన్నది..ఏక కాలంలో ముగ్గురు.. మూడు రోజుల పాటు ఇద్దరే. వారు కంప్యూటర్లలో ఉన్న రికార్డుల్ని ప్రింట్ తీసుకోవడానికి సమయం కేటాయించారు. రూ. రెండు లక్షల 14వేల సొమ్ముతో పాటు… 12 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజానికి అది స్వాధీనం కాదు… పంచనామా రాసి.. వాటికి లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చి.. ఆ సొమ్మును శ్రీనివాస్‌కే ఇచ్చేశారు. అంటే ఆ కొద్ది మొత్తం కూడా రికార్డుల్లోనే స్వాధీనం చేసుకున్నారు.

రాజకీయ గుప్పిట్లో చిక్కుకుపోయిన మీడియా.. అసలు వాస్తవాల్ని.. మసిపూసి మారేయడుకాయ చేసి.. ప్రజల్ని గందరగోళ పర్చడానికే ప్రయత్నిస్తున్నాయి. రాజకీయం..మీడియాను.. అంత ఘోరంగా వాడుసేకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com