మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకొన్నాడు ఫహద్ ఫాజల్. ‘పుష్ప’తో తన ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ‘పుష్ప’ తరవాత తెలుగులో నేరుగా ఏ సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు ఓ కథ ఒప్పుకొన్నాడు. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫహద్ కూడా నటిస్తారన్న వార్తలు జోరందుకొన్నాయి. ఇప్పుడు అదే నిజం అయ్యింది. ఈ సినిమాలో ఫహద్ రాక దాదాపు ఫిక్స్. ఇటీవల అనిల్ రావిపూడి ఫహద్ ని కలిసి, కథకూడా వినిపించేశారని తెలుస్తోంది. కథ ఆయనకు కూడా నచ్చిందని, ప్రస్తుతానికి ఎగ్రిమెంట్స్ వ్యవహారం నడుస్తోందని టాక్. అవన్నీ ఫైనల్ అవ్వగానే, చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుంది.
ఫహద్ ఫాజల్ తో పాటుగా తమిళ హీరో కార్తీ పేరుకూడా వార్తల్లో నిలిచింది. అయితే కార్తీని అసలు చిత్రబృందం ఓ ఆప్షన్ గానే అనుకోలేదని, ఫహద్ ఫాజల్ వారి మొదటి, చివరి ఆప్షన్ అని తెలుస్తోంది. ‘పుష్ప’లో ఫహద్ ని విలన్ గా చూసినా, ఆయన కామెడీ టైమింగ్ ఎలాంటిదో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ లోఫహద్ బాగా మిక్స్ అవుతాడు. సో.. ఈ కాంబో తప్పకుండా క్రేజీగానే ఉండబోతోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అనిల్ – వెంకీ కాంబోలో ఇది 5వ సినిమా అవుతుంది. గత 4 చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.


