నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన గ్రామ సభ లో ఓ రైతు నేరుగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అయితే బుగ్గన అది అసైన్డ్ ల్యాండ్ అని, కుటుంబ వివాదం అని తనకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో బుగ్గన అనుచరులు సెటిల్మెంట్ పేరుతో ఆ రైతు భూమిని కాజేయడం నిజమని గ్రామస్తులు చెబుతున్నారు.
సెటిల్మెంట్ పేరుతో భూములు కాజేసిన బుగ్గన అనుచరులు
కొత్తబురుజుకు చెందిన కుమ్మరి మద్దిలేటి అనే రైతు, ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో నేరుగా తన గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , ఆయన అనుచరులు తనకున్న 3 ఎకరాల భూమినిఅక్రమంగా ఆక్రమించారని, ఆ భూమిని బుగ్గన తన అనుచరుల పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తన సర్వే నంబర్లను మార్చేశారని, తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల మధ్య ఉన్న వివాదాల కారణంగా సెటిల్మెంట్ పేరుతో ఈ వివాదంలోకి వచ్చిన బుగ్గన అనుచరులు అది అసైన్డ్ భూమి కావడంతో … సులువుగా తమ పేరుపైకి మార్చేసుకున్నారు. ల
తనకు సంబంధం లేదన్న బుగ్గన
బుగ్గన వివరణ ప్రకారం, ఆ భూమికి సంబంధించి ఆ రైతుకు, అతని సోదరులకు మధ్య చాలా కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సివిల్ వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం తనపైకి నెడుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా ఒక ప్రైవేట్ భూమి వివాదమని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్డీవో అది అసైన్డ్ భూమి అని చెబుతున్నారని కానీ చంద్రబాబు చెప్పనీయడం లేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి స్పందన
రైతు ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు, అక్కడికక్కడే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భూమిని కాజేయడం దుర్మార్గమని పేర్కొంటూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆక్రమణ నిజమని తేలితే ఎంతటి వారైనా వదిలేది లేదని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఆ భూమికి సంబంధించిన పాత రికార్డులను , ప్రస్తుత రికార్డులను పరిశీలిస్తున్నారు. విచారణ తర్వాతే ఇది రాజకీయ కబ్జానా లేక బుగ్గన చెబుతున్నట్లు కుటుంబ కలహాలా అనేది అధికారికంగా స్పష్టమవుతుంది. అయితే బుగ్గన వందేళ్ల కిందట ఉన్న ఇంట్లో ఉన్నా.. లాంటి కబుర్లు చెబితే.. కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది.


