రాజాసాబ్ రన్ టైమ్ పై ముందు నుంచీ.. చర్చ నడుస్తూనే ఉంది. నాలుగ్గంటల సినిమా తీశాడు మారుతి. గంట సినిమా పక్కన పెట్టి, 3 గంటల రన్ టైమ్ సెట్ చేశారు. అయినా డిస్కర్షన్ నడిచింది. ఓ హారర్ సినిమాకు ఇంత లెంగ్త్ అవసరమా? అన్నారు. కాకపోతే ప్రభాస్ సినిమా కదా, వర్కవుట్ అయిపోతుందన్న భరోసా కలిగింది. ఇప్పుడు లెంగ్త్ గురించే ఎక్కువగా మాట్లాడుకొంటున్నారు. సినిమా మరీ బోరింగ్ గా నడిచిందని, మూడు గంటల సినిమా విసుగొచ్చిందన్న కామెంట్లు వినిపించాయి. మరోవైపు విడుదలకు ముందుఅందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన ఓల్డ్ గెటప్ ఏమైందని అడుగుతున్నారు. వీటిపై ఇప్పుడు రాజాసాబ్ టీమ్ దృష్టి సారించింది.
లెంగ్త్ ఎక్కువైందన్న కామెంట్ ని సీరియస్ గా తీసుకొన్న టీమ్.. ఇప్పుడు రీ ఎడిట్ చేసింది. సినిమాలో కొంత మేర ట్రిమ్ చేస్తున్నట్టు దర్శకుడు మారుతి ప్రకటించారు. అంతేకాదు.. ఫ్యాన్స్ కోరిక మేరకు ఓల్డ్ గెటప్ లోని సీన్ యాడ్ చేస్తున్నారు. అదో 9 నిమిషాల సీన్. అంటే.. కొంత ట్రిమ్ చేసి, కొత్త సన్నివేశాన్ని జోడిస్తున్నారన్నమాట. నిజానికి ఈ ఆలోచన ముందు వస్తే బాగుండేది. ముందే సినిమాని ట్రిమ్ చేసుంటే ఈ విమర్శలు, నెగిటివిటీ కాస్తయినా తగ్గేది. ఇప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. కొత్త సీన్లు ఉన్నాయని… కొత్తగా వెళ్లేవాళ్లు చాలా తక్కువ. సినిమా కొత్తగా చూసేవాళ్లకు ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నా, ఇప్పటికే రావాల్సిన టాక్ వచ్చేసింది.
సినిమా లెంగ్త్ విషయంలో దర్శక నిర్మాతలు చాలా నిక్కచ్చిగా ఉండాలన్న విషయాన్ని రాజాసాబ్ రిజల్ట్ మరోసారి గుర్తు చేసింది. స్టార్ హీరో అయినా.. లెంగ్తీ సినిమాల్ని భరించే శక్తి ఇప్పటి ప్రేక్షకులకు లేదు. సినిమా బాగుంటే.. లెంగ్త్ ఉన్నా ఫర్వాలేదు అనుకొంటారు కానీ, మంచి సినిమాల్ని కూడా లెంగ్త్ ఇష్యూలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిపై దర్శకులు మరింత ఫోకస్ చేయాలి.
