గత 17 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు ఈరోజుతో శుభం కార్డు పడింది. రేపటి నుంచి షూటింగులు యధావిధిగా మొదలు కానున్నాయి. 30 శాతం వేతనాలు పెంచాల్సిందే అని కార్మికులు సమ్మెకు దిగడం, అంతంత వేతనాలు పెంచలేమని నిర్మాతలు మొండికేయడంతో గత కొన్ని రోజులుగా షూటింగులు ఎక్కడకక్కడ ఆగిపోయాయి. రెండు వర్గాల్నీ రాజీకి తీసుకురావడానికి మెగాస్టార్ చిరంజీవి రంగ ప్రవేశం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమస్య పరిష్కారం దిశగా చొరవ తీసుకోవడంతో.. ఈ సమస్యకు పుల్ స్టాప్ పడింది. గత రెండు మూడు రోజులుగా చిరంజీవి ఇరు వర్గాలతో సమావేశమై, వాళ్ల సాధక బాధకాలు తెలుసుకొంటూనే ఉన్నారు. రెండు వర్గాలతో విడివిడిగా ఒకసారి, రెండు వర్గాల్నీ కలిపి ఓసారి సమావేశం ఏర్పాటు చేశారు. చిరు మధ్యవర్తిత్వానికి అటు కార్మికులు, ఇటు నిర్మాతలు ఇద్దరూ ఒప్పుకోవడంతో, రాజీ కి మార్గం ఏర్పడింది.
కార్మికులు అడిగినట్టు 30 శాతం వేతనాలు పెంచకపోయినా, 22.5 శాతం పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. ఈ పెంచిన వేతనాలు మూడు దఫాలుగా అమలు చేస్తారు. తొలి యేడాది 15 శాతం, రెండో యేడాది 2.5 శాతం, మూడో యేడాది మరో 5 శాతం.. ఇలా మూడు దఫాలుగా పెంచుతారు. కార్మికులు – నిర్మాతల మధ్య చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. వాటిలో కొన్నింటికి పరిష్కారం దొరికింది. మరికొన్ని విషయాల్లో ఇంకా ఓ నిర్ణయానికి రావాల్సివుంది. పని గంటలు, ఆదివారం డబుల్ బేటా విషయాల్లో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై ఓ కమిటీ వేసి, నెల రోజుల్లో నివేదిక రాబట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.