నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి షాక్. ఈరోజు ‘అఖండ 2’ ప్రీమియర్స్ ఆగిపోయాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ల కోసం రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసినా – ప్రీమియర్లు లేకపోవడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగించింది. 14 రీల్స్ ప్లస్స్ గత సినిమాల తాలుకూ అప్పులు… ‘అఖండ 2’ విడుదలకు అనుకోని బ్రేకులు వేశాయి. దాదాపు రూ.30 కోట్ల వరకూ నిర్మాతలు బాకీ పడ్డారు. ఫైనాన్షియర్లు ఈ సినిమాని అడ్డుకొంటారని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే.. రూ.30 కోట్లే కదా, నిర్మాతలు తీర్చేస్తారు అనుకొన్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట కూడా ఫైనాన్స్ క్లియర్ చేయడానికి చివరి నిమిషం వరకూ కష్టపడ్డారు. కాకపోతే.. వాళ్ల ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. దాంతో ప్రీమియర్లు రద్దు చేస్తున్నాం అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సివచ్చింది.
ఇప్పటికే ఏపీలో ప్రీమియర్ల కోసం టికెట్లు అమ్మేశారు. ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేస్తారు. తెలంగాణలో ఎలాగూ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి గొడవా లేదు. కాకపోతే… ప్రీమియర్లతో రావాల్సిన ఆదాయానికి గండి పడినట్టైంది. రేపైనా ఈసినిమా విడుదల అవుతుందా, లేదా? అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు. తెల్లవార్లూ ఈ పంచాయితీ నడిచే అవకాశం ఉంది. ఈలోగా క్లియరెన్స్ వస్తే సరే సరి. లేదంటే యూఎస్ ప్రీమియర్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఓ పెద్ద సినిమాకు, విడుదలకు ముందు రోజున ఇలాంటి పరిస్థితి రావడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీమియర్ల రోజునా ఇలాంటి టెన్షన్ వాతావరణమే కనిపించింది. చివరి క్షణాల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో క్లియరెన్స్ వచ్చింది. ఈసారి కూడా అలానే జరుగుతుందని అనుకొన్నారు. కానీ.. చివరికి ప్రీమియర్లు రద్దు చేసుకోవాల్సివచ్చింది.