ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా – ఎన్నో ఒడిదుడుకులు. ‘నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా’ అనే హేళ‌న‌లు. వాట‌న్నింటికీ దాటుకుని రావ‌డ‌మే.. జీవితం. ప్రతీ స్టార్ జీవితంలోనూ ఇలాంటి చేదు గుళిక ఒక‌టి త‌ప్ప‌కుండా ఉంటుంది. శోభ‌న్‌బాబూ అందుకు అతీతం కాదు.

శోభ‌న్ బాబు టైటిల్ రోల్ పోషించిన తొలి చిత్రం ‘వీరాభిమ‌న్యు’. ఎన్టీఆర్ శ్రీ‌కృష్ణుడైతే.. శోభన్‌బాబు అభిమ‌న్యుడుగా న‌టించారు. ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమాకి, మ‌రో పాత్ర ధారి కి టైటిల్ రోల్ ఇవ్వ‌డం అన్న‌ది అరుదైన విష‌యం. పైగా శోభ‌న్ బాబు అప్పుడ‌ప్పుడే అడుగులు వేస్తున్న యువ న‌టుడు. ఆ అవ‌కాశం, అదృష్టం శోభ‌న్ బాబుకి ద‌క్కింది. పైగా హ‌ర‌నాథ్ చేయాల్సిన పాత్ర అది. అభిమ‌న్యుడి పాత్ర‌కు హ‌ర‌నాథ్‌కి ఎంచుకున్నారు కూడా. కానీ ఎందుకో.. చివ‌రి క్ష‌ణాల్లో హ‌ర‌నాథ్ ని ప‌క్క‌న పెట్టారు. శోభ‌న్ బాబుని ఈపాత్ర‌కు తీసుకోమ‌ని ఎన్టీఆర్ స‌ల‌హా ఇవ్వ‌డంతో నిర్మాత‌ దుండీ.. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా స‌రే, శోభ‌న్ బాబుని తీసుకోవాల్సివ‌చ్చింది.

ఎన్టీఆర్ రిక‌మెండేష‌న్‌, పైగా తొలిసారి టైటిల్ రోల్. ఎలాగైనా స‌రే, ఈ సినిమాతో నిరూపించుకోవాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు శోభ‌న్ బాబు. కొన్ని రోజులు షూటింగ్ బాగానే గ‌డిచింది. కానీ.. మ‌ధ్య‌లో ఓ అప‌శ్రుతి. అర్జునుడు ప‌ద్మ‌వ్యూహంలో అడుగుపెట్టే సీన్ తీస్తున్నారు. ఆ ప‌ద్మ‌వ్యూహంలో దుర్యోధ‌నుడికీ, అర్జునుడికీ ఫైట్. ఇద్ద‌రూ గ‌ద‌ల‌తో కొట్టుకోవాలి. దుర్యోధ‌నుడిగా రాజ‌నాల న‌టిస్తున్నారు. అప్ప‌టికే ఆయ‌న పెద్ద స్టార్‌. ఒక‌రోజులో నాలుగైదు షిఫ్టుల‌కు ప‌ని చేస్తున్నారు. రాజ‌నాల లాంటి సీనియ‌ర్ మోస్ట్ న‌టుడితో ఫైటింగ్ అనేస‌రికి.. శోభ‌న్ బాబుకి టెన్ష‌న్ మొద‌లైంది. పైగా భారీ గ‌ద‌ల‌తో కొట్టుకోవ‌డం. అలాంటి స‌న్నివేశాలు ఇది వ‌ర‌కు న‌టించిన అనుభ‌వం లేదు. అందుకే శోభ‌న్ బాబు త‌డ‌బ‌డ్డాడు. టైమింగ్ త‌ప్పింది. గ‌ద నేరుగా రాజ‌నాల మొహాన్ని తాకింది. అంతే.. రాజ‌నాల ముక్కు చిట్లి, ర‌క్తం ధారాళంగా కారింది.

అస‌లే రాజ‌నాల‌కు కోపం ఎక్కువ‌. టైమింగ్ త‌ప్పిన శోభ‌న్ బాబుపై వీరావేశంతో చెల‌రేగిపోయారు. తిట్లూ, శాప‌నార్థాలు. ‘అస‌లు నీకెవ‌డు అవ‌కాశం ఇచ్చాడు?’ అన్నంత రేంజుకి వెళ్లిపోయారాన‌. సెట్లో అంద‌రి ముందూ.. రాజ‌నాల విరుచుకుప‌డిపోయేస‌రికి శోభ‌న్‌బాబు మొహం చిన్న‌దైపోయింది. దుండీకి మొద‌ట్నుంచీ శోభ‌న్ బాబుపై న‌మ్మ‌కం లేదు. ఈ ఘ‌ట‌న‌తో ఆయ‌నా పేట్రేగిపోయారు. ‘రామారావు మొహం చూసి నిన్ను తీసుకున్నాం’ అంటూ ఆయ‌నా వాటాకొచ్చారు. దాంతో.. శోభ‌న్ బాబు అవ‌మాన భారంతో ఇంటికెళ్లిపోయారు. ఇక సినిమాల‌కు త‌ను ప‌నికి రాన‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. `వీరాభిమ‌న్యు సినిమా నుంచి త‌న‌ని తీసేస్తార‌ని.. డిసైడ్ అయిపోయారు.

కానీ తెల్లారేస‌రికి ఇంటికి కంపెనీ కారొచ్చింది. దాంట్లోనే సెట్ కి వెళ్లారు శోభ‌న్ బాబు. ‘న‌న్ను ఈ సినిమా నుంచి త‌ప్పించండి.. నేను చేయ‌లేను’ అని దుండీకి మొర‌పెట్టుకున్నారు శోభ‌న్ బాబు. అయితే దుండీకి ఇంకా కోపం వ‌చ్చేసింది. ‘అయితే నీపై తీసిన స‌న్నివేశాల‌న్నీ ఏం చేసుకోవాలి?’ అంటూ మ‌రింత ఘాటుగా దూషించారు. గ‌త్యంత‌రం లేక‌… సినిమా పూర్తి చేయాల్సివ‌చ్చింది. షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులూ శోభ‌న్ బాబుకీ, రాజ‌నాల‌కీ మాట‌ల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.

సినిమా పూర్త‌య్యింది. అనూహ్యం. అపూర్వం. సినిమా సూప‌ర్ హిట్టు. శోభ‌న్‌బాబు పేరు మార్మోగిపోయింది. సోలో హీరోగా శోభ‌న్ బాబుకి ఓ ఇమేజ్ ఏర్ప‌డింది. కాలం గిర్రున తిరిగింది. శోభ‌న్ బాబు ఓ స్టార్ అయ్యాడు. రాజ‌నాల ఫేమ్ త‌గ్గింది. అవ‌కాశాలు దూర‌మ‌య్యాయి. అనారోగ్యం పాల‌య్యారు. ఆస్తులు క‌రిగి అప్పులు మిగిలాయి. ఓరోజు.. చెన్నైలోని శోభ‌న్ బాబు ఇంటికి వెళ్లారు రాజ‌నాల. ఆయ‌న్ని అలా చూడ‌గానే శోభ‌న్ బాబు చ‌లించిపోయారు. ఇంట్లో అతిథి మ‌ర్యాద‌లు చేసి సాగ‌నంపారు. రాజ‌నాల‌కి వీడ్కోలు చెబుతూ… ఓ క‌వ‌రు చేతిలో పెట్టారు శోభ‌న్ బాబు. రాజ‌నాల ఇంటికి వెళ్లి క‌వ‌రు తెరిచి చూస్తే… అందులో యాభై వేలున్నాయ‌ట‌. ఇప్ప‌టి దాని విలువ కొన్ని ల‌క్ష‌ల‌కు పైమాటే. అప్ప‌ట్లో రాజ‌నాల వ‌ల్ల త‌ను అవ‌మాన భారం మోశాన‌నో, మ‌రోట‌నో మ‌న‌సులో పెట్టుకోక – ఓ గొప్ప న‌టుడికి – ఆప‌ద కాలంలో త‌న వంతు సాయం చేశారిలా. బ‌ళ్లు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్లూ అవ్వ‌డం చిత్ర‌సీమ‌లో ఎంత స‌హ‌జ‌మో.. తెలిపే ఉదాహ‌ర‌ణ ఇది. ఈత‌రం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close