ఓబులాపురం మైనింగ్ కేసులో ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి గట్టి షాక్ తగిలింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమెను కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. శ్రీలక్ష్మి ఈ కేసులో నిందితురాలేనని ట్రయల్ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి పై ట్రయల్ కొనసాగనుంది. ఇప్పటికే ఈ కేసులో గాలి జనార్ధనా రెడ్డిసహా నిందితులకు శిక్ష ఖరారు అయింది. గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ వేసి.. అనుకూల ఉత్తర్వులు పొందడంతో ఆమెపై ట్రయల్ సాగలేదు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు.. హైకోర్టు మరోసారి విచారించాలని వెనక్కి పంపింది. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. శ్రీలక్ష్మి కూడా ట్రయల్ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఐఏఏస్ వై. శ్రీలక్ష్మి 2007-2009 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా పనిచేశారు. ఈ సమయంలో ఆమె మైనింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించిన నిర్ణయాలలో కీలక పాత్ర పోషించారు. ఒబులాపురం మైనింగ్ కంపెనీ కు అనుకూలంగా అక్రమ మైనింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయడంలో అవినీతి , అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ కేసు పెట్టింది. గాలి జనార్ధన్ రెడ్డితో కుమ్మక్కై, అనంతపురంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ లైసెన్స్‌లను మంజూరు చేశారని ఆరోపించింది. ముందుగానే వచ్చిన మైనింగ్ లైసెన్స్ దరఖాస్తులను తిరస్కరించి, OMCకు మూడు మైనింగ్ ఏరియాలను కేటాయించారు.. క్యాప్టివ్ మైనింగ్ అనే పదం తీసేసి దోపిడీకి మార్గం సుగమం చేశారు.
2009 డిసెంబర్ 7న OMC చేసిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై CBI కేసు నమోదు చేసింది 2011 నవంబర్ 28న శ్రీలక్ష్మిని CBI అరెస్ట్ చేసింది. చంచల్‌గూడ జైలులో రెండు నెలల పాటు గడిపారు. అనారోగ్యం కారణంగా 2012 అక్టోబర్‌లో బెయిల్ పొందారు. CBI 2012 మార్చి 30న ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది, దీనిలో శ్రీలక్ష్మిని ఏ-6గా చేర్చారు. అయితే 2022 నవంబర్ 8న, తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చి, ఆమెపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను రద్దు చేసింది, ఆమె నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ వెళ్లింది. హైకోర్టులో వాదనల తర్వాత మళ్లీ ఆమె నిందితురాలేనని హైకోర్టు తేల్చింది. ఇతర నిందితులందరికీ శిక్ష ఖరారు అయినందున శ్రీలక్ష్మి కూడా తప్పించుకోలేదని.. ట్రయల్ పూర్తయితే శిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.