తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల నిధుల గోల్ మాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర పార్టీ నుండి అందిన భారీ నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని, మధ్యలోనే గోల్ మాల్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అభ్యర్థులకు అందాల్సిన ఆర్థిక సాయం విషయంలో కొందరు కీలక నేతలు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు పార్టీ శ్రేణుల్లోనే అసహనాన్ని పెంచుతున్నాయి.
ఆర్థిక లావాదేవీల్లో జరిగిన పొరపాట్లు , నిధుల వినియోగంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించడానికి అధిష్టానం ఒక ప్రత్యేక దూతను హైదరాబాద్కు పంపినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమైన సదరు నేత, నియోజకవర్గాల వారీగా అందిన నిధులు, ఖర్చు చేసిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. లెక్కల్లో తేడాలు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ వార్తలను రాష్ట్ర స్థాయి నేతలు కొందరు ఖండిస్తున్నారు. ఇది కేవలం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని, ప్రతి రూపాయికి లెక్క ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నిధుల వివాదం పార్టీ నాయకత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.


