అమెరికా.. ఈ దేశం చేరుకోవడమే జెన్ Z లక్ష్యం అన్నట్లుగా చదువులు, ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని అమెరికా పంపాలని చేయని ప్రయత్నాలు ఉండవు. కోటి అయినా అప్పు చేసి అమెరికా పంపుతాయి . ఒకసారి అక్కడికి పోతే అక్కడ సెటిలైపోవచ్చని .. డాలర్ల వర్షం కురుస్తుందని అనుకుంటారు. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడు అమెరికన్ లైఫ్ స్టైల్ ఇండియాలో నూ లభిస్తోంది. ఆ స్థాయి జీతాలూ వస్తున్నాయి. అవకాశాలూ పెరుగుతున్నాయి. అదే సమయంలో అమెరికా రాను రాను నరకంగా మారుతోంది. అందుకే ఇక అమెరికా టార్గెట్ కాదనే అంచనాలకు రావాల్సిన సమయం వచ్చింది.
అమెరికాలో తగ్గిపోతున్న అవకాశాలు
అమెరికాలో ఇప్పుడు గతంలోలా అవకాశాలు లభించడం లేదు. ఒకప్పుడు వారికి మ్యాన్ పవర్ అవసరం కాబట్టి వివిధరకాల వీసాల పేరుతో అవకాశాలు కల్పించారు. ఇప్పుడు అమెరికా కంపెనీలు.. ప్రపంచం మొత్తం విస్తరించి వ్యాపారాలు చేస్తున్నాయి. కేవలం అమెరికా నుంచే కాకుండా ప్రపంచం మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అన్ని చోట్లా ఆఫీసులు పెట్టుకుంటున్నాయి. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కొత్తగా కొత్త శిఖరాలు అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐ రంగంలో పిడికెడు మదికి తప్ప ఇంకెవరికీ అక్కడ అవకాశాలు లభించడం లేదు.
అమెరికాలో తగ్గిపోతున్న శాంతిభద్రతలు
అమెరికా ఒకప్పుడు సేఫెస్ట్ కంట్రీ. 911కు ఫోన్ చేస్తే గుండుసూది పోయినా తెచ్చిస్తారని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇటీవల నాగమల్లయ్య అనే వ్యక్తిని చంపేసిన విధానం చూసిన తర్వాత.. ఇంత దారుణమైన పరిస్థితులు అమెరికాలో ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. అంత కంటే దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. కాల్పులకు లెక్క లేదు. ట్రంప్ తో పాటు ఇతర పార్టీ జాతి విద్వేషాలను పెంచి రాజకీయాలు చేస్తున్నాయి. ఈ కారణంగా అక్కడ శాంతిభద్రతలు మరింతగా క్షీణించే అవకాశం ఉంది.
అమెరికాకు వెళ్తే క్షణక్షణం భయమే !
అమెరికాకు వెళ్లిన వాళ్లు.. వాళ్లు బంధువులకు ఇప్పుడు క్షణక్షణం ఉత్కంఠే. ఎంతగా అంటే.. హెచ్వన్బీ వీసాల వివాదం సమయంలో ఇండియన్స్ రాకపోకల్ని ఆపేందుకు విమాన టిక్కెట్లను బ్లాక్ చేసేశారు. అంటే విద్వేషం ఏ స్థాయిలో పెంచుకుంటున్నారో ఆర్థం చేసుకోవచ్చు. అమెరికాకు వెళ్లినప్పటి నుండి అందరు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే జెన్Z ఇప్పుడు అమెరికా తమ టార్గెట్ కాదన్న అభిప్రాయానికి వస్తోంది. ఇది దేశానికి కూడా మంచి అవకాశం.


