టాలీవుడ్ నిర్మాతల దృష్టి ఇప్పుడు సెప్టెంబరు 5పై పడింది. ఎందుకంటే ఈరోజు తెలుగు నుంచి ఏకంగా 3 సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. అంటే… మొత్తంగా 4 సినిమాలన్నమాట.
సెప్టెంబరు 5న ఘాటీ రిలీజ్ కానుంది. క్రిష్ – అనుష్క కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఏప్రిల్ నుంచి రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం వల్ల సెప్టెంబరు 5కి వెళ్లిపోయింది.
ఇదే రోజున ‘మిరాయ్’ రాబోతోంది. తేజా సజ్జా హీరోగా నటించిన సినిమా ఇది. ‘హనుమాన్’ తరవాత తేజా నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే. పీపుల్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మంచు మనోజ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది. ఓటీటీ సంస్థ కూడా సెప్టెంబరు 5నే సినిమాని విడుదల చేయాలని షరతు పెట్టిందట.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గాళ్ ఫ్రెండ్’. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5నే తీసుకుని రావాలనుకొంటున్నారు. అంటే ఒకే రోజు 3 తెలుగు సినిమాలన్నమాట. ఇవి చాలదన్నట్టు తమిళం నుంచి ‘మదరాసీ’ అనే ఓ సినిమా రాబోతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా ఇది. అలా 4 సినిమాలయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా డ్రాప్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదు. అన్ని సినిమాలూ ఓటీటీ డిసైడ్ చేసిన డేట్ కే వస్తున్నాయి. కాబట్టి ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ తప్పదు.