ఎడిటర్స్ కామెంట్ : కరోనాపై విజయం సాధించారా..? చేతులెత్తేశారా..?

కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా గొప్ప స్థాయిలో నిలబడ్డారని.. సోషల్ మీడియోలో ప్రచారం చేసుకుంటున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అధికార పార్టీలు… తాము కంట్రోల్ చేశామంటే.. తాము చేశామని సర్టిఫికెట్లు జారీ చేసుకుంటున్నారు. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో విఫలమయ్యారంటూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసే రాజకీయం కూడా… నడుస్తోంది. ప్రజలను ఇళ్లకు పరిమితం చేసి రెండు నెలలు పూర్తవుతోంది. ఇప్పుడిప్పుడే.. సాధారణ జీవితం ఏర్పడటానికి ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. కానీ.. కరోనా తగ్గిందా..? అంటే… తగ్గలేదు సరికదా.. మరింత ఉద్ధృతం అవుతోంది. మరి ప్రభుత్వాలు సాధించిందేమిటి..?

కరోనాపై గెలిచామని లాక్‌డౌన్ ఎత్తేస్తున్న ప్రభుత్వాలు..!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గడగడలాడిపోతున్న సమయంలో.. ఇండియాలో వైరస్ ఉద్ధృతి అంతగా లేదు. ఉందో లేదో కానీ.. భారత్ టెస్టింగ్ సామర్థ్యం అంతంతమాత్రమే అప్పట్లో. దాని ప్రకారం.. చేస్తున్న టెస్టులతో… అప్పట్లో వైరస్ ప్రభావం పెద్దగా లేదని అంచనా వేసి.. దాన్ని అక్కడే కట్టడి చేయాలంటే… లాక్ డౌన్ ప్రకటించాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ఉన్న పళంగా ప్రకటించేశారు. కరోనా విషయంలో అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇక యుగాంతమే.. అందర్ని వైరస్ మింగేస్తుందన్న భయాన్ని మీడియా కల్పించడంతో.. ప్రజలు కూడా.. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చన్న భయంతో.. ఇంటలోనే ఉండిపోవడానికి స్వచ్చందంగా సహకరించారు. కానీ చెప్పిన దానికి… జరుగుతున్నదానికి పొంతన లేకుండా పోయింది. వందల కేసులున్నప్పుడు లాక్ డౌన్ విధిస్తే.. ప్రజలందర్నీ ఇళ్లకే పరిమితం చేసి.. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుకుని.. మరీ రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే.. వైరస్ కంట్రోల్‌లోకి రాకపోగా.. అంతకంతకూ తీవ్రమవుతూ వస్తోంది. ఇప్పటికి ఇండియాలో లక్షన్నర కేసులు దాటిపోయాయి. ఎక్కడా తగ్గుతునన సూచనలు కనిపించడం లేదు. మరి లాక్ డౌన్ సక్సెస్ అయిందని ఎలా చెప్పగలరు…? లాక్ డౌన్ విధించకపోతే.. దేశంలో లక్షల కేసులు ఉండేవని… చెప్పుకొస్తున్నారు. ఉండేవో లేవో ఎవరూ చెప్పలేరు. కానీ.. ఇప్పుడు మాత్రం లక్షల కేసులే ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

సమస్యను మూలల నుంచి గుర్తించకుండా.. నిప్పులపై దుప్పటి కప్పెట్టిన పాలకులు..!

ప్రస్తుతం కేసులు పెరగడానికి వలస కూలీలను.. విదేశాల నుంచి వస్తున్న వారిని కారణంగా చూపిస్తున్నారు. కానీ.. వలస కూలీలు.. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడే వైరస్ వస్తుందా..? వారు ఉన్న రాష్ట్రంలో వైరస్ బారినపడ్డారు. అక్కడ వలస కూలీల వరకూ వైరస్ పాకిపోయిందని అర్థం. సొంత రాష్ట్రానికి వచ్చిన తర్వాత టెస్టులు చేశారు కాబట్టి బయటపడింది. ఆంధ్ర నుంచో.. తెలంగాణ నుంచో.. సొంత రాష్ట్రాలకు వెళ్లిన కూలీలకు చేసిన టెస్టుల్లోనూ కరోనా పాజిటివ్ లు బయటపడ్డాయి. వలస కూలీల్లో పెద్ద ఎత్తున కేసులు బయటపడుతూంటే.. వైరస్ ఎంత తీవ్రంగా వ్యాపించిందో అర్థం చేసుకోవడానికి ఎంతో మేధస్సు ఉపయోగించాల్సిన పని లేదు. రెండు నెలల నుంచి ఆ వలస కూలీలు పనుల్లోకి పోవడం లేదు. అయినా వైరస్ బారినపడ్డారు. వారి జీవన శైలి కారణంగా.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ప్రభుత్వాలు..ఈ అంశాలను సీరియస్‌గా తీసుకోలేదు. లాక్ డౌన్ ప్రకటించేసి.. అదే.. మందు అన్నట్లుగా వ్యవహరించాయి. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ మాత్రమే మందు కాదు… జాగ్రత్తగా ఉండాలి.. కరోనాతో జీవించాలి.. అనే కబుర్లు చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.

దీన్ని గెలిచామనరు.. చేతులెత్తేశాం అంటారు..!

కరోనాను కట్టడి చేశామని పైకి చెబుతున్నారు కానీ.. వాస్తవంగా.. ప్రతీ రోజూ నమోదవుతున్న కేసుల్ని చూస్తే.. చేతులెత్తేశారని అనుకోవాలి. లాక్ డౌన్ వల్లే కరోనా కట్టడి కాలేదని.. నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వాలు.. ఆర్థిక వ్యవస్థకు పట్టిన కరోనా మరంత ముదరకుండా ఉండాలంటే.. సడలింపులు ఇవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం.. వరుసగా.. సడలింపులు ఇస్తూ పోతున్నారు. బస్సులు, కార్లు, విమానాలు సహా.. అన్నింటికీ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ప్రజా రవాణా అన్ని విభాగాల్లోనూ అదుపులోకి వచ్చినట్లు అవుతుంది. వైరస్ భయం ప్రజల్లో ఉంటుంది కాబట్టి.. పూర్తి స్థాయిలో కాకుండా.. పరిమితంగానే అందుబాటులోకి తెచ్చారు. రేపో మాపో పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేరుకు మాత్రం లాక్ డౌన్ అమల్లో ఉందని ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. వైరస్‌ను నియంత్రించడం ఇక అసాధ్యమని.. ప్రభుత్వాలు ఓ నిర్ణయానికి వచ్చి… విజయం సాధించేశామని ప్రకటన చేసేసి… చేతులెత్తేశాయని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా వదిలేసి ఉంటే కనీసం హెర్డ్ ఇమ్యూనిటీ అయినా వచ్చి ఉండేది..!

కేంద్రం లాక్ డౌన్ ప్రకటించకపోతే… లక్షల సంఖ్యలో వైరస్ కేసులు బయటపడేవన్న అభిప్రాయాన్ని విమర్శలకు సమాధానంగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే.. అలాంటి పరిస్థితి వచ్చింది. నిజంగా లాక్ డౌన్ ప్రకటించకపోతే… దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఉండేదన్న వాదన వినిపిస్తోంది. కొన్ని దేశాల్లో మరణాల రేటు అతి తక్కువగా ఉండటానికి ఈ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడమే కారణం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా వంటిదేశాల్లో ప్రజల ఆహారపు అలవాట్లు… ఇతర కారణాల వల్ల.. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగినంతగా లేక.. కరోనా కాటుకు పిట్టల్లా రాలిపోతున్నారని అంటున్నారు. ఇతర దేశాల్లో మాత్రం… మరణాల రేటు తక్కువగానే ఉంది. భారత్‌లోనూ ఆరోగ్యంగా ఉన్న వారెవరూ.. కరోనా కారణంగా చనిపోలేదు. కనీసం లక్షణాలు కూడా బయటపడలేదు. పిల్లల్ని.. వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుని .., లాక్ డౌన్ ప్రకటించకపోతే.. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉండేదన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్ోతంది.

ప్రభుత్వాలదేం లేదు.. ప్రజలే బాధ్యతగా మసలుకోవాలి..!

ప్రభుత్వాలు ఇప్పటి వరకూ చేసింది.. చేయబోయేది ఏమీ లేదు. ఏదైనా ప్రజలే చేయాలి. కరోనా నుంచి కాపాడుకోవాలంటే… వీలైనంత వరకూ… కాంటాక్ట్స్ తగ్గించుకోవాలి. మాస్కులు.. శానిటైజర్‌తో రక్షణ పొందాలి. ప్రభుత్వం గేట్లు వదిలేసింది. కరోనా ఇక జనంలో కలిసిపోయింది. కాబట్టి… ప్రభుత్వాలు.. క్రెడిట్ కోసం ఆరాటపడతాయి.. కానీ ఫలితంగా కోసం ఆశ పడవు. ఆ ఫలితం తేడా వస్తే.. ఇబ్బంది పడేది ప్రజలే. అందుకే.. ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

గంటా కూడా కుమారుడికే వైసీపీ కండువా కప్పించబోతున్నారు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ... వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని...

HOT NEWS

[X] Close
[X] Close