ఏలూరులో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతూంటే.. కారణమేంటో కనిపెట్టడానికి అధికారవర్గాలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో మాస్ హిస్టీరియా కావొచ్చంటూ ప్రజలపైనే తప్పును మోపే ప్రయత్నం కూడా జరిగింది. ఒకరిని చూసి ఒకరు భయపడుతూ.. అనారోగ్యానికి గురవుతున్నారని.. మూర్చపోతున్నారని.. నిజానికి వారికేం జబ్బు లేదని… చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజం అదే పరిస్థితి అయితే..దాదాపుగా పది మందిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది..? శారీరకంగా ఎందుకు వందల మంది రోగులు బలహీనమవుతారు..? అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి సామూహిక అనారోగ్య పరిస్థితులు వస్తే.. ముందుగా కారణం కనుక్కునేందుకు ప్రయత్నిస్తాయి. కారణం కనిపెడితే.. చికిత్స చేయడం.. ప్రజలకు భరోసా ఇవ్వడం సులువు అవుతుంది.అయితే.. ప్రస్తుత ప్రభుత్వం అధికారులు.. అలాంటి ప్రయత్నమే చేయలేదు. పెద్దగా పరిశీలన చేయకుండానే… మంత్రి ఆళ్ల నాని నీటి కాలుష్యం లేదని ప్రకటించేశారు. ఫుడ్ పాయిజనింగ్ కూడాకాలేదన్నారు. మంత్రి ప్రకటన చేసే సమయానికి ఇంకా పూర్తి స్థాయి రిపోర్టులు రాలేదు. వైద్య ఆరోగ్య మంత్రినే అలాంటిప్రకటన చేసిన తర్వాత రిపోర్టులు ఇక.. జల కాలుష్యం అని అధికారులు ఇస్తారా..? జలు కాలుష్యం జరగిందని చెప్పవద్దని పరోక్షంగా ఆయన తన ప్రకటన ద్వారా నిర్దేశించిటనట్లయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారణం చెబితే.. ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారేమోనన్న కారణంగానే… అధికారులు.. ప్రభుత్వ పెద్దలు మాస్ హిస్టిరియా… అనే వాదాన్ని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది.వింత వ్యాధి అంటూ… ఇతర ప్రజల్ని కూడా కంగారు పెడుతున్నారు. రోగుల లక్షణాలు చూస్తే.. నీరు లేదా ఆహారంలో.. ప్రమాదకమైన కెమికల్స్ కలవడం ద్వారా ఆలాంటి అనారోగ్య లక్షణాలు వస్తాయని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. అదీ కూడా.. ఏలూరులో కొన్ని కాలనీల్లోనే ఈ తరహా రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడకు సరఫరా చేస్తున్న నీరు రంగు మారి వస్తోందని.. బాధితులే చెబుతున్నారు. కానీ… నీరు బాగుందని.. ప్రజలే మాస్ హిస్టిరియాకు గురువుతున్నారని వాదించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ప్రభుత్వం ఏ పని చేసినా రాజకీయ విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి కీలకమైన అంశాలు దాచి పెట్టే ప్రయత్నం చేయడం.. ప్రజల్లో మరింత భయాందోళనలను పెంచుతుందని.. నిపుణులు అంటున్నారు. ఏలూరు ప్రజల అనారోగ్యానికి కారణాలేమిటో ప్రభుత్వం తక్షణం చెబితే… ప్రజలు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారని… వారిలో ధైర్యం వస్తుందని అంటున్నారు. అలా కాకుండా.. మాస్ హిస్టిరియా అంటూ.. ప్రచారం చేస్తే.. నిజంగానే అ ప్రభావం ప్రజలపై పడే ప్రమాదం ఉందంటున్నారు.