గ్లోబలైజేషన్‌లోని అనర్థాలను ఎత్తిచూపుతున్న గ్రీస్ సంక్షోభం

చిన్నకార్లు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరల తగ్గుదలను చూపించి ద్రవ్యోల్భణం తగ్గిపోయిందని జబ్బలు చరిచేసుకుంటున్న కేంద్రప్రభుత్వ సారధులు, కందిపప్పుధర మూడేళ్ళలలో రెండింతలు పెరిగి కిలో 110 రూపాయలకు చేరుకున్న వాస్తవాన్ని మాత్రం తివాచీ కిందికి తోసేస్తున్నారు. ఈ ”కష్టకాలంలో” రాష్ట్రప్రభుత్వాలు నడుములు బిగించేసి పెద్దపెద్ద సప్లయిర్లతో మాట్లాడి కిలో 90 రూపాయలకే అమ్మించే ఏర్పాట్లు చేస్తూంటాయి. సకాలంలో ధరలు తగ్గించే చర్యలు అని మీడియా కోడై కూస్తూవుంటుంది. నిజమే కాబోలు అని మనమూ నమ్మేస్తాము.

అయితే 35 రూపాయల కందిపప్పు 110 కి ఎలా పెరిగింది? అని మూలాల్లోకి వెడితే గ్రీసు దేశం సమాధానమౌతుంది. సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల ఎగుమతి దిగుమతుల్లో ఆక్షలు అంతరించి ప్రపంచం ఒకటైపోయింది. చవగ్గా వున్నపుడు వస్తువును కొనేసి ధరపెరిగేవరకు దాచి పెట్టడం దేశీయ టోకువ్యాపారి లక్షణం. ఈ స్ధానంలోకి ప్రపంచ టోకువ్యాపారి అదేపనిగా సరుకు కొనేస్తున్నాడు. కొరతమొదలై ధరపెరుగుతూ వుంటుంది. ప్రపంచ టోకు వ్యాపారి పుచ్చిపోవచ్చిన  పాత స్టాకును పేకెట్లలో పెట్టి ఆఫర్లు ఇచ్చి రిలయెన్స్ మాల్ లాంటి మాల్స్ కి అందజేస్తారు. ఆఫర్లంటే మనకి పిచ్చ పిచ్చి కాబట్టి అవసరం వుందా లేదా అని చూసుకోకుండా కొనేసుకుంటూ వుంటాము. ఇదే స్ధూలంగా ప్రపంచీకరణలో టోకు, చిల్లర వ్యాపారాల చక్రం. దీని ప్రభావం పెద్ద దేశమైన భారతదేశంలో ఆహారవస్తువుల ధరల పెరుగదల వరకూ వచ్చింది..చిన్నదేశమైన గ్రీసు ని దివాళా తీయించింది.

గ్రీస్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐరోపా యూనియన్‌(ఈయూ), యూరపు సెంట్రల్‌ బ్యాంకు (ఇసిబి), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)…ఈమూడు సంస్ధలూ  గ్రీస్‌ ఆర్థిక సమస్యలపై చూపిన పరిష్కారాలు ఆ దేశాన్ని మరింత కషా్టల్లోకి నెట్టేసింది. ప్రపంచీకరణ లోని ఒకదుష్పలితంగా ఈ వ్యాధి ఇప్పుడు యూరప్‌కూ, ఇతర దేశాలకూ పాకుతోంది. మూడు ద్రవ్య సంస్థలు గ్రీకు బ్యాంకులకిచ్చే రుణాలపై పరిమితులు విధించడంతో ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సంక్షోభానికి మూలాలు 2008లో అమెరికాలో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దిగ్గజాలు యూరోజోన్‌లో బలహీనంగా ఉన్న గ్రీస్‌ లాంటి దేశాలపైకి నెట్టివేయాలని చూసిన ఫలితమే ఈ సంక్షోభం. గత అయిదేళ్లుగా ‘పొదుపు చర్యలు’ పేరుతో మూడు ఐరోపా ద్రవ్యసంస్ధల ఆంక్షలకు ఇది పరాకాష్ట. ఎటిఎంల నుంచి రోజుకు 60 యూరోలకు మించి నగదు తీసుకోకుండా పరిమితులు విధించింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలను గ్రీస్‌ పరిధిలోనే సాగించాలని నిబంధన పెట్టింది. విదేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపడాన్ని నిషేధించింది. ఐరోపా ఫైనాన్షియల్‌ బ్యాంకులు, రుణదాతలు కలిసికట్టుగా సృష్టించిందే ఈ సంక్షోభం. దీని దెబ్బకు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్‌ ఒక్క రోజులోనే 500 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూసింది. సిడ్నీ నుంచి వాల్‌స్ట్రీట్‌దాకా అన్ని స్టాక్‌మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. భారత స్టాక్‌ మార్కెట్‌పై కూడా ప్రభావం పడింది. ఇది 2008లో లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభం కన్నా తీవ్రమైనదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2009లో గ్రీస్‌ పరపతిని క్రెడిట్‌ రేటింగ్స్‌ సంస్థలు తగ్గించడంతో ఈ సంక్షోభ జాడలు బయటపడ్డాయి.

దీనిని ఆసరాగా చేసుకుని గ్రీస్‌ను తన రుణచట్రంలో బంధించేందుకు ఈయూ పథకం వేసింది. దానిలో భాగంగానే 2010 మేలో 14,600 కోట్ల డాలర్ల బెయిలవుట్‌ ఒప్పందాన్ని గ్రీస్‌పై రుద్దింది. ఆ ఒప్పందమే గ్రీస్‌ పాలిట యమపాశంలా మారింది. ఆ ఒప్పందం మాటున పొదుపు చర్యల పేరుతో విధించిన షరతులు గ్రీస్‌ను సర్వనాశనం చేశాయి. ప్రజల కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీశాయి. అప్పటికే బలహీనపడిన గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థను మరింత అథపాతాళానికి నెట్టాయి. అంతిమంగా గ్రీస్‌ రుణభారం 3,400 కోట్ల డాలర్లకు పెంచేశాయి. గ్రీస్‌ వార్షిక స్థూల ఆదాయం కన్నా ఈ అప్పు రెండు రెట్లు ఎక్కువ. దేశంలో నిరుద్యోగం విశ్వరూపం దాల్చింది. పింఛన్లపై ఎడాపెడా కోతలు పెట్టడంతో 90 శాతం మంది రిటైర్డు ఉద్యోగుల పింఛన్లు దారిద్య్ర రేఖకన్నా దిగువ స్థాయికి పడిపోయాయి. ఈయూ రుద్దిన ఈ పొదుపు చర్యలపై గ్రీకు ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం అయిదు మాసాల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిబింబించింది. పొదుపు చర్యలను వ్యతిరేకించిన సిరిజా పార్టీకి వారు పట్టం గట్టారు. అంతకుముందున్న కన్సర్వేటివ్‌ పార్టీని ఓడించారు. ఆ ఎన్నికల్లో ప్రజాకంటక పొదుపు చర్యలను రద్దు చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చిన సిరిజా, అధికారంలోకి వచ్చిన తరువాత ఈయూ సంస్థలతో చర్చలు తిరిగి ప్రారంభించింది. రుణ ఊబిలో కూరుకుపోయిన గ్రీస్‌ను గట్టెక్కించేందుకు షరతుల్లేని రుణం ఇవ్వాలని కోరారు. దీనికి ఇయు కూటమి అంగీకరించకపోగా మరిన్ని కఠిన షరతులు విధించింది. దీనిని అంగీకరిస్తే తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంతో సిరిజా వ్యూహాత్మకంగా రిఫరెండమ్‌ మార్గాన్ని ఎంచుకుంది. నిజానికి రిఫరెండం అవసరమే లేదు. ఆ ఒప్పందాన్ని నేరుగా తిరస్కరించవచ్చు. రిఫరెండమ్‌కు వెళ్లాలని నిర్ణయించడంలో సిరిజా ప్రభుత్వ ఊగిసలాట ధోరణి ప్రస్ఫుటమవుతోంది. గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే గ్రీస్‌కు రుణ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.  గ్రీస్ దేశ ఆర్థిక భవితను నిర్ణయించే రిఫరెండంలో గ్రీస్‌ ప్రజలు ఆదివారం ప్రశాంతంగా తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. 1.1 కోట్ల మంది ప్రజానీకం పాల్గొన్న ఈ రెఫరెండంలో మెజార్టీ ప్రజానీకం ‘నో’ వైపు మొగ్గు చూపినట్లుగా ఆదేశ మీడియా అంచనా వేసింది.

నిజానికి గ్రీస్‌ పరిణామాలు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు పట్టిన పెద్ద జబ్బులో భాగం. 2008 సంక్షోభం నుంచి బయటపడడానికి వివిధ దేశాలు ఫైనాన్స్‌ సంస్థలకు బెయిలవుట్‌ ప్రకటించడం ద్వారా సంక్షోభాన్ని ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వాలకు బదలాయించాయి. ప్రభుత్వాలు సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రజలపై భారాలు వేయనారంభించాయి. పరిమితికి మించి ప్రజలు భారాలు మోయలేని పరిస్థితుల్లో మొత్తం వ్యవస్థే సంక్షోభానికి గురవుతోంది. శరీరసౌష్టవానికి, సాహసానికి, అందానికీ గ్రీకువీరుడు ఒక ప్రతీక. అలాంటి మనుషుల మాతృదేశమైన గ్రీసు ఇపుడు ఆర్ధిక సమస్యలతో మంచంపట్టిన రోగిలా దీనంగా మూలుగుతోంది. గ్రీసు సంక్షోభం కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. మన రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఇటీవలే హెచ్చిరించినట్లు ఇది 1930ల మాదిరిగా ఒక పెద్ద సంక్షోభానికి సూచిక. ధనిక దేశాలు మేలుకోకపోతే ఆ సంక్షోభం త్వరలోనే వాటిచుట్టూ కూడా ముంచుకొస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com