రివ్యూ : సిద్దార్థ్ ” గృహం “

Gruham movie review, Gruham Review

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

హార‌ర్ సినిమా అంటే చిరాకెత్తే స్థాయిలో ఈ జోన‌ర్‌ని వాడిపాడేశారంతా. దెయ్యాలు కామెడీ చేయ‌డం మొద‌ట్లో స‌ర‌దాగానే ఉన్నా, రాను రాను న‌వ్వులాట అయిపోయింది. భ‌యం అనే ఎలిమెంట్ త‌గ్గిపోయి క్ర‌మంగా హార‌ర్ సినిమా అంటే కామెడీ అనుకొనే స్థాయికి చేరిపోయింది. అయితే ఇప్ప‌టికీ ఈ జోన‌ర్ అంటే ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు ఉన్నారు. భ‌యాన్ని భ‌యంగానే చూపిస్తే, త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. అందుకే ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నం చేశాడు సిద్దార్థ్‌. క‌థానాయ‌కుడిగా వ‌రుస అప‌జ‌యాలు ఎదుర్కొంటున్న త‌రుణంలో, తానే నిర్మాత‌గా మారి ఓ హార‌ర్ క‌థ తీశాడు. అదే గృహం. త‌మిళ‌నాట విడుద‌లై మంచి వ‌సూళ్లు అందుకొన్న గృహం… తెలుగులోనూ అలానే భ‌య‌పెడుతుందా? గృహంలో భ‌య‌పెట్టే అంశాలేమున్నాయి??

* క‌థ‌

క్రిష్ (సిద్దార్థ్‌) ఓ డాక్ట‌ర్‌. త‌న భార్య ల‌క్ష్మి (ఆండ్రియా)తో క‌ల‌సి ఆనంద‌క‌ర‌మైన జీవితం సాగిస్తుంటాడు. వీళ్ల ఇంటికి ఎదురుగా పాల్ (అతుల్ కుల‌క‌ర్ణి) కుటుంబం దిగుతుంది. వాళ్ల‌మ్మాయి జెన్నీ… చాలా అల్ల‌రి. క్రిష్‌ని స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తుంటుంది. క్రిష్ – జెన్నీల సాన్నిహిత్యం చూసి ల‌క్ష్మి కూడా కుళ్లుకుంటుంది. క్రిష్ – పాల్ కుటుంబాలు బాగా ద‌గ్గ‌ర‌వుతాయి. అయితే క్ర‌మంగా జెన్నీ ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా మార్పు వ‌స్తుంది. స‌డ‌న్‌గా ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తుంటుంది. వెర్రిగా కేక‌లు వేస్తుంటుంది. ‘ఈ ఇంట్లోంచి వెళ్లిపోండి. లేదంటే మిమ్మ‌ల్ని చంపేస్తా’ అంటూ చైనీస్ భాష‌లో అరుస్తుంటుంది. జెన్నీలో లీజింగ్ అనే దెయ్యం ఆవ‌హించింద‌ని అర్థం అవుతుంది. లీజింగ్‌తో పాటు మ‌రో రెండు దెయ్యాలు కూడా అదే ఇంట్లో ఉంటున్నాయి. మ‌రి ఈ మూడు దెయ్యాల క‌థేంటి?? జెన్నీని ఆత్మ ఎందుకు ఆవ‌హించింది? ఆత్మ బారీ నుంచి జెన్నీని ఎలా కాపాడుకున్నారు అనేదే ‘గృహం’ క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ఓ భ‌వంతి. అందులో ఓ కుటుంబం కొత్త‌గా రావ‌డం. అప్ప‌టి వ‌ర‌కూ ఆ ఇంట్లో త‌చ్చాడుతున్న ఆత్మ‌… వాళ్ల‌తో ఓ ఆట ఆడుకోవ‌డం… మ‌ధ్య‌లో కాస్త కామెడీ – ఇదీ ఇప్ప‌టి వ‌ర‌కూ చూస్తున్న దెయ్యం క‌థ‌లు. ఆ వెకిలి కామెడీ మిన‌హాయిస్తే.. ‘గృహం’ క‌థ కూడా సేమ్ టూ సేమ్ ఇదే. కామెడీ ఎప్పుడైతే మిస్ అయి, సీరియెస్ విష‌యాన్ని సీరియెస్‌గానే చెప్ప‌డం మొద‌లెట్టారో, అప్పుడే భ‌యం.. ఇంకా భ‌యంగా క‌నిపించ‌డం మొద‌లైంది. సినిమా టేకాఫ్ కాస్త స్లోనే. సిద్దార్థ్ – ఆండ్రియా మ‌ధ్య బెడ్ రూమ్ స‌న్నివేశాల‌తో హాట్ హాట్‌గా మొద‌ల‌వుతుంది. లిప్‌లాక్‌లు బోలెడున్నాయి. జెన్నీ ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం ద‌గ్గ‌ర్నుంచి క‌థ‌లోకి భ‌యం అనే ఎలిమెంట్ ప్ర‌వేశిస్తుంది. కాసేపు ఇదేమైనా ‘చంద్ర‌ముఖి’ టైపు క‌థేమో అనిపిస్తుంది. క్రమంగా ఆ మ‌బ్బులు కూడా తొల‌గిపోతాయి. ఇంట్ర‌వెల్ సీన్‌లో… సిస‌లైన హార‌ర్ సినిమా చూపించాడు ద‌ర్శ‌కుడు. సౌండ్ ఎఫెక్ట్స్ , విజువ‌ల్స్‌తో కావ‌ల్సినంత భ‌య‌పెట్టాడు. ఇక సెకండాఫ్‌లో దెయ్యాన్ని వ‌దిలిస్తే స‌రిపోతుంది అనుకొంటారంతా. అలా చేస్తే.. ‘గృహం’ కూడా మామూలు దెయ్యం క‌థ‌లానే మిగిలిపోదును. సెకండాఫ్‌లో ఓ ట్విస్ట్ వ‌స్తుంది. అది మాత్రం… షాక్ ఇచ్చేదే. అక్క‌డే ద‌ర్శ‌కుడు మొత్తం మార్కులు కొట్టేస్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ సైడ్ క్యారెక్ట‌ర్‌లా అనిపించిన సిద్దూ.. ఆ ట్విస్ట్ త‌ర‌వాత రెచ్చిపోతాడు. ఇంట్ర‌వెల్ సీన్స్‌లో ఎంత భ‌య‌ప‌డ్డారో, ప‌తాక స‌న్నివేశాల్లో అంత‌కంటే ఎక్కువ భ‌యం క‌లిగించాడు. మొత్తానికి ఓ నిజ‌మైన హార‌ర్ అనుభూతి క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లం అయ్యాడు. క‌థ రొటీనే అయినా, నేప‌థ్యం మార్చ‌డం, అందులో సిద్దూ లాంటి ల‌వ‌ర్ బోయ్‌ని ఎంచుకోవ‌డం, దానికి తోడు… ఒక‌టీ, రెండు దెయ్యాలు కాక‌… మూడు దెయ్యాల్ని క‌థ‌లో చొప్పించ‌డం… ఇలా పాత క‌థ‌కు కొత్త కోటింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ర్క‌వుట్ అయ్యింది.

* న‌టీన‌టులు

సిద్దార్థ్ జోన‌ర్ మార్చాడు. ప్రేమ‌, థ్రిల్ల‌ర్ క‌థ‌లు చేసిన సిద్దూ… తొలిసారి హార‌ర్ జోన‌ర్ ఎంచుకొన్నాడు. అందుకే న‌టుడిగానూ కొత్త‌గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకొనే అవ‌కాశం వ‌చ్చింది. తొలిస‌న్నివేశాల్లో ఎప్ప‌టిలా రొమాంటిక్‌గా క‌నిపించిన సిద్దూ, ప‌తాక స‌న్నివేశాల్లో విజృంభించాడు. జెన్నీ పాత్ర‌లో క‌నిపించిన న‌టి… సిద్దూతో పోటీ ప‌డి న‌టించింది. త‌న న‌ట‌న చాలా స‌హ‌జంగా క‌నిపించింది. దెయ్యం ఆవ‌హించిన సంద‌ర్భాల్లో… ఆమె న‌ట‌న మ‌రింత ర‌క్తి క‌ట్టింది. ఆండ్రియా, సురేష్‌, అతుల్ కుల‌క‌ర్ణి…. త‌మ త‌మ పాత్రల్లో రాణించారు. పాత్ర‌లు త‌క్కువ‌గా ఉండ‌డం, ప్ర‌తీ పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండ‌డం, అంద‌రూ త‌మ త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు రాణించ‌డంతో ఈ క‌థ మ‌రింత ర‌క్తి క‌ట్టింది.

* సాంకేతిక వ‌ర్గం

విజువ‌ల్‌గా `గృహం` బాగుంది. టెక్నిక‌ల్ టీమ్ బాగా క‌ష్ట‌ప‌డింది. కెమెరాని రివ‌ర్స్ చేయ‌డం, వ‌స్తువుల‌న్ని త‌ల క్రిందులుగా చూపించ‌డం, అందులోంచి సిద్దార్థ్ న‌డుచుకొంటూ వెళ్ల‌డం… ఈ ట్రిక్కులు బాగా అనిపిస్తాయి. సౌండ్‌తో భ‌య‌పెట్ట‌డం, విజువ‌ల్‌గా భ‌య‌పెట్ట‌డం రెండు ర‌కాలు. ఇవి రెండూ గృహంలో క‌నిపించాయి. నేప‌థ్య సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. డైలాగ్స్ కూడా అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకొన్నాయి.

* తీర్పు

ఈమ‌ధ్య వ‌చ్చిన హార‌ర్ సినిమాల్లో ‘గృహం’ త‌ప్ప‌కుండా త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపించుకొంటుంది. హార‌ర్ సినిమా అంటే భ‌య‌ప‌డ‌డానికే అనుకొన్న వాళ్ల‌కు ‘గృహం’ మంచి ఆప్ష‌న్‌. అయితే తొలి స‌న్నివేశాల్లో రొమాన్స్ ఎక్కువ‌గా ఉంది. హార‌ర్ కామెడీని రొమాంటిక్ కామెడీగా మార్చేశాడు ద‌ర్శ‌కుడు. ఇక నుంచి ఇలాంటి జోన‌ర్ ఒక‌టి మొద‌ల‌వుతుందేమో.

* ఫైన‌ల్ ట‌చ్‌: ‘గృహం’.. అంతా భ‌యం!

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com