గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను ప్రయోగిస్తూ, గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను, ముఖ్యంగా చమురు ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ పరిణామాల వల్ల చమురు ఉత్పత్తి నిలిచిపోవడమే కాకుండా, సాధారణ ప్రజల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఈ యుద్ధంతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ, భారతదేశం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సవాలును ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న దాదాపు కోటి మంది భారతీయ పౌరులే. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కేవలం తాత్కాలికంగా వెళ్లిన వారు మాత్రమే కాదు. దశాబ్దాలుగా అక్కడే స్థిరపడి, అక్కడి వ్యవస్థల్లో అంతర్భాగమైన వారు లక్షలాది మంది ఉన్నారు. కేవలం పర్యాటకానికి , స్వల్పకాలిక పనుల కోసం వెళ్లిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకురావడం సాధ్యమే కానీ, అక్కడ ఆస్తులు, వ్యాపారాలు కలిగి ఉండి, పూర్తిగా స్థిరపడిపోయిన వారిని తరలించడం ప్రభుత్వానికి అంతతేలిక కాదు.
కస్మాత్తుగా అన్నింటినీ వదిలేసి రావడానికి వారు సిద్ధంగా లేకపోవడం, ఒకవేళ రావాలనుకున్నా అంత భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు అవసరమైన రవాణా వనరులు సమకూర్చుకోవడం దేశం ముందున్న అతి పెద్ద సవాల్. యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఒక ఎత్తయితే, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల అక్కడ పనిచేస్తున్న భారతీయుల ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. భారతీయులు పంపే విదేశీ ద్రవ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమే. ఇప్పుడు అక్కడ నెలకొన్న అస్థిరత వల్ల కేవలం వ్యక్తుల క్షేమమే కాదు, మన దేశ ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. యుద్ధ భూమిలో చిక్కుకున్న తమ వారి క్షేమం గురించి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతానికి భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాల ద్వారా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, భద్రతా నిబంధనలు పాటించాలని సూచనలు జారీ చేస్తోంది. అయితే, యుద్ధం గనుక దీర్ఘకాలం కొనసాగితే లేదా మరింత తీవ్రమైతే.. భారతీయుల ప్రాణాలను, వారి భవిష్యత్తును కాపాడటం అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎవాక్యూషన్ ఆపరేషన్‌గా మారవచ్చునని అంచనా వేస్తున్నారు.
