పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఈనెల 24న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ బై ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. నిడివి దాదాపుగా 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది.
సెన్సార్ రిపోర్ట్ పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేలానే ఉంది. ఫస్టాఫ్ చాలా బాగుందని, ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా కొత్తగా డిజైన్ చేశారని, విజువల్స్, కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందన్నది సెన్సార్ రిపోర్ట్. క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాని రెండు భాగాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. పార్ట్ 2కి లీడ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరిందని, కథ అసంపూర్ణమైనా సంతృప్తికరమైన ముగింపే ఆశించొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ చేయాలి? అనే విషయంపై చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడ చేసినా – పవన్ అభిమానులు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలిరావడం ఖాయం. ఇప్పటికే వీరమల్లు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది. త్వరలో మరో ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.