కుమారుడు విదేశాలకు వెళ్తున్నారని దిగబెట్టడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని హరీష్ రావు రిక్వెస్ట్ చేయడంతోనే పోలీసులు ఏడున్నర గంటల తరవాత విచారణ ముగించారు. లేకపోతే ఆయన విచారణ ఇంకా కొనసాగేది. మధ్యంతరంగా ఆయన వెళ్లిపోయారు కాబట్టి మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణ ముగిసిన తరవాత సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ప్రకటన కూడా అలాగే ఉంది. విచారణ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
హరీష్ రావు విచారణ నుంచి బయటకు వచ్చిన తరవాత రాజకీయంగా చాలా వ్యాఖ్యలు చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులతో టచ్ లోకి వెళ్లడం, మాట్లాడటం చేయవద్దని సిట్ సూచించింది.
హరీష్ రావు ప్రెస్మీట్ లో తడబడుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. దానికి తగ్గ పరిణామాలు సిట్ విచారణలో జరిగాయని అనుకోవచ్చు. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించింది. అదే సమయంలో టీవీ చానల్ అధినేతతో కలిసి ట్యాపింగులు చేయించారన్నదానికి ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించారని చెబుతున్నారు. అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించి తప్పించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. అలాంటి వాదనతో బయటపడలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
నేడో రేపో మరోసారి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయనున్నారు. సుప్రీంకోర్టు కొట్టి వేసిన కేసులో విచారణకు పిలిచారని.. బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడాన్ని సజ్జనార్ ఖండించారు. ఆ కేసు కాదని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీష్ రావును విచారణ జరిపారమన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. మొత్తంగా హరీష్ రావు విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇంకా మిగిలే ఉందని క్లారిటీ వచ్చేసినట్లయింది.