కేరళలో ఒక వ్యక్తి ఆత్మహత్య అక్కడి మగవాళ్లందర్నీ కదిలించింది. పురుషులకూ రక్షణ కావాల్సిందేనని వారిదైన శైలిలో ఉద్యమం చేస్తున్నారు. కేరళలో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని దేశమంతా చర్చకు కారణం అవుతోంది. రద్దీగా ఉండే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళ తీసిన 18 సెకన్ల వీడియో, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సదరు మహిళ ఆ వ్యక్తి తనను తాకాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, నిజానిజాలు తేలకముందే నెటిజన్లు అతడిపై విరుచుకుపడ్డారు. ఈ డిజిటల్ వ్యక్తిత్వ హననం భరించలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు కేరళ మగ సమాజాన్ని రోడ్డుపైకి తెచ్చింది.
డిజిటల్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా?
వీడియో తీస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తాకాడా లేక రద్దీ వల్ల చేయి తగిలిందా అనే కనీస విచక్షణ ఆ మహిళా ఇన్ఫ్లూయన్సర్ చూడలేదు. కేవలం వ్యూస్ లేదా ప్రచారం కోసమే సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకున్నారు. తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా, నేరుగా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అతడిని సమాజం ముందు దోషిగా నిలబెట్టింది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అందరూ ఈ అంశంపై మాట్లాడటం ప్రారంభించారు. అతను చనిపోయినట్లుగా తెలియగానే.. ఇన్ఫ్లూయన్సర్ కనిపించకుండా పారిపోయారు.
కన్నెర్ర చేసిన మగ సమాజం – అట్టపెట్టెల నిరసన
ఆ వ్యక్తికి జరిగిన అన్యాయానికి నిరసనగా కేరళలో పురుషులు వినూత్నంగా స్పందిస్తున్నారు. బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు మగవాళ్లు తమ శరీరాలకు అట్టపెట్టెలు అడ్డుపెట్టుకుని ప్రయాణిస్తున్నారు. మేము మిమ్మల్ని చూడటం లేదు, తాకడం లేదు.. మా ముఖం కూడా మీకు కనిపించదు. ఇప్పుడు కూడా మాపై నిందలు వేస్తారా అనే అర్థంలో ఈ నిరసన సాగుతోంది. కేవలం మగవాడు కాబట్టే వేధింపులకు పాల్పడతారనే ముద్ర వేయడం ఆపాలని, మగవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుందని వారు గట్టిగా వినిపిస్తున్నారు.
మగవాడికీ రక్షణ కావాలి – చట్టాల్లో మార్పు రావాలి
ప్రస్తుత చట్టాలు ఎక్కువగా మహిళలకు అనుకూలంగా ఉండటాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో సాగే లింక్ లీడింగ్, క్యారెక్టర్ అస్సాసినేషన్ నుంచి పురుషులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం జరగాలని కేరళలో మెన్స్ రైట్స్ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఒక అమాయకుడి ప్రాణం పోయాక చేసే విచారణ కంటే, అసలు అలాంటి పరిస్థితులు రాకుండా చూడటమే అసలైన రక్షణ అని వారు వాదిస్తున్నారు.


