గ్రీన్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. తన జెండా పాతినట్లుగా పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా మారింది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం.
గ్రీన్ ల్యాండ్‌ను కొనలేరు!
1867లో రష్యా నుంచి అలస్కానో లేక 1917లో డెన్మార్క్ నుంచే వర్జిన్ ఐలాండ్స్ ను కొన్నట్లుగా ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను కొనలేరు. ఎందుకంటే గ్రీన్లాండ్ కేవలం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు, దానికి సొంత ప్రభుత్వం, పార్లమెంటు ఉన్నాయి. డెన్మార్క్ ప్రధాని గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అమ్ముతామన్నా కూడా అక్కడ నివసించే 56,000 మంది ప్రజల అంగీకారం తప్పనిసరి. ఆ దేశంలోని 85 శాతం మంది ప్రజలు అమెరికాలో కలవడానికి సుముఖంగా లేరు.
సైనిక చర్య చేపడితే ఏం జరుగుతుంది?
ఒకవేళ ట్రంప్ నిజంగానే పట్టుబట్టి సైనిక చర్యకు దిగితే, అది ప్రపంచ సంబంధాలను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. డెన్మార్క్ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం . నాటోలో వ్యవస్థాపక సభ్యురాలు. నాటో నిబంధనల ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది కూటమిలోని అన్ని దేశాలపై దాడి జరిగినట్లే భావిస్తారు. అంటే అమెరికా తన సొంత మిత్రదేశాలపైనే యుద్ధం ప్రకటించినట్లవుతుంది. ఇది నాటో కూటమి ముగింపుకు నాంది పలుకుతుంది. ఐరోపా దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి.
అంతర్జాతీయ చట్టాలు , ఆంక్షలు
ఐక్యరాజ్యసమితి ప్రకారం ఏ దేశమైనా మరొక సార్వభౌమ దేశ భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించడం చట్టవిరుద్ధం. అమెరికా ఇలాంటి పనికి పూనుకుంటే రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడికి, దీనికి తేడా ఉండదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికాకున్న నైతిక విలువ దెబ్బతింటుంది. ఐరోపా సమాఖ్య ఇప్పటికే అమెరికాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ట్రంప్ ఇప్పటికే డెన్మార్క్‌తో సహా ఎనిమిది దేశాలపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధిస్తామని బెదిరించారు, దీనికి ప్రతిగా ఐరోపా దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్స్ విధించేందుకు సిద్ధమయ్యాయి.
అమెరికాకు సైనిక పరంగా నష్టం
బలవంతపు ఆక్రమణ వల్ల గ్రీన్లాండ్లోని స్థానిక ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసే అవకాశం ఉంది. అక్కడ అపారమైన ఖనిజాలు ఉన్నప్పటికీ, వాటిని వెలికితీసేందుకు అయ్యే ఖర్చు కంటే ఆ ప్రాంతాన్ని నియంత్రించడానికి అయ్యే ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెను భారం కావచ్చు. అలాగే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాలను అడ్డుకోవాలని చూస్తున్న అమెరికా, ఈ చర్యతో తన మిత్రదేశాలను కోల్పోయి ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, బలవంతపు సైనిక చర్య అనేది అమెరికాకే ఆత్మాహుతి సదృశ్యంగా మారుతుంది.
