కాళేశ్వరం సంబరంలోనూ హరీష్ రావు కనిపించరు..!

“కాళేశ్వరం సాధకుడ్ని నేనే..” అని తెలంగాణ సీఎం కేసీఆర్… ప్రెస్‌మీట్‌లో ఘనంగా చెప్పుకున్నారు. అది నిజమే. కానీ సాధన … ఆలోచనల వరకే పరిమితం. మిగతా మొత్తం క్షేత్ర స్థాయిలో ఉండి…కాళేశ్వరం అనే యజ్ఞాన్ని నిర్వజ్ఞంగా నడిపించిన ఘనత మాత్రం… గత ప్రభుత్వంలో జనవనరుల మంత్రిగా ఉన్న హరీష్ రావుదే. అధినేత ఆలోచనల మేరకు.. ఆయన మంత్రిగా.. సగం సమయాన్ని కాళేశ్వరం పైనే కేంద్రీకరించారు. పనులను పరుగులు పెట్టించారు. కాంట్రాక్టర్లు ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా.. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. ప్రాజెక్ట్ గట్ట మీదే తిన్నారు.. అక్కడే పడుకున్నారు. ఓ విధంగా.. అది ఆయన మానసపుత్రిక. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో హరీష్ పేరు ఎక్కడా వినిపించడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ వెనుక మాజీ మంత్రి హరీష్ రావు కృషిని ఎవరూ కూడ కాదనలేరు. ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్ రావు అధికారులను పరుగులు పెట్టించారు. రేయనక, పగలనక ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగండంలో హరీష్ రావు కృషి చాలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రాత్రి పూట పడుకొని కూడ ఆయన ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు అంటేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ సాధించిన ప్రగతిలో హరీష్ రావు పాత్ర ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ప్రతీదీ షెడ్యూల్ ప్రకారం చేయించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తన మార్క్ వేశారు హరీష్ రావు . కొద్ది రోజుల క్రితం.. వెట్ రన్ సక్సెస్ అయింది. అప్పుడూ హరీష్ రావుకు పిలుపు లేదు. ఆ సమయంలో పలువురు అధికారులు హరీష్ రావు కృషిని గుర్తు చేసుకొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు.. అత్యంత క్లిష్టమైన సమస్య అయిన.. భూసేకరణను.. చాలా పకడ్బందీగా నిర్వహించడంలోనూ.. హరీష్ రావు తనదైన మార్క్ చూపించారు. అంత పెద్ద ప్రాజెక్ట్ కు భూసేకరణ అంటే.. చిన్న విషయం కాదు. హరీష్ రావు.. మంత్రిగా ఉన్నప్పుడు.. నిర్వాసితుల వద్దకు వెళ్లి.. ప్రాజెక్ట్ అవసరాలు చెప్పి… ఆ ప్రాజెక్ట్ వల్ల బతుకులు ఎలా బాగుపడతాయో చెప్పి.. అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ఆయన బాధ్యతల నుంచి వైదొలిగాక… సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు… కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ఇంత కష్టపడిన హరీష్ రావు ఎక్కడా వినిపించడం లేదు. ఆయనకు కనీసం ఆహ్వానం కూడా ఉండదని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలతో తేలిపోతోందని.. అంటున్నారు. బహుశా.. అదే నిజం కావొచ్చు కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com