హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యతను కేసీఆర్ హరీష్‌రావుకు అప్పగించారు. అభ్యర్థిని ఖరారు చేసిన రోజునే హరీష్ రావు ధూం..ధాంగా ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందు నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన ఆయన…. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన రోజు నుంచి అసలు ప్రచారం ప్రారంభించారు. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ గుండెల మీద తన్నిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఈటల రాజేందర్ కూడా.. సమాధానం ఇస్తున్నారు. అయితే ఈటల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హరీష్‌పై ప్రతి ఆరోపణలు చేయడం లేదు కానీ… సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు.
పద్దెనిమిదేళ్లు కలిసి పని చేశామని ఉద్యమ సహచరులమని.. అలాంటి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదని ఈటల … హరీష్ రావుకు హితోక్తులు పలుకుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్‌ను ఎప్పటికైనా కైవసం చేసుకోవాలనేది హరీష్ రావు కల అది ఎప్పటికి సాధ్యం కాదని కూడా చెబుతున్నారు. హరీష్‌కూ తన లాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఉండగా ఈటల రాజేందర్, హరీష్‌రావు ఓ గ్రూప్‌గా ముద్రపడ్డారు. కేసీఆర్ కంటే హరీష్‌తోనే ఈటలకు ఎక్కువ సాన్నిహిత్యం ఉందని అనుకున్నారు. రెండో సారి కేసీఆర్ గెలిచిన తర్వాత ఈటలతో పాటు హరీష్‌కూ మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పుడు కూడా గుసగుసలు వినిపించాయి.
తర్వాత ఇద్దరికీ మంత్రి పదవి ఇచ్చినా మెల్లగా ఈటల బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు హరీష్ రావే.., ఈటలను ఓడించి… టీఆర్ఎస్‌ను గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు మిత్రుల మధ్య హుజూరాబాద్‌లో సవాల్ నడుస్తోంది. ఎవరికి వారు… ఒకరిపై ఒకరు ఎగబడటం లేదు. ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఈటల రాజేందర్… ప్రజలతోనూ అదే విధంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. పద్దెనిమిదేళ్లుగా నియోజకవర్గానికి సేవ చేశానని..ప్రస్తుతం ఇంటికో రూ. వెయ్యి ఇచ్చి తన పోరాటంలో తోడుండాలని కోరుతున్నారు. షెడ్యూల్ రాక ముందే హుజూరాబాద్ బరి వేడెక్కుతోంది.