పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు. కేవలం పొలిటీషయన్ మాత్రమే కాదు. ఆయన రెండూనూ. ఆయన సినిమాల్లో రాజకీయాలకు సంబంధించిన డైలాగులు, పొలిటికల్ స్పీచ్‌లో సినిమా డైలాగులూ వినిపించడం కామన్. అభిమానులు కూడా అవే ఆశిస్తారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మాత్రం పొలిటికల్ సెటైర్లు, పార్టీలపై పంచ్ డైలాగులూ ఉండవు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వెల్లడించారు. `ఉస్తాద్` రెండో పాట విడుదలైన సందర్భంగా హరీష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. పాటకు మంచి స్పందన వస్తుందని తెలియజేస్తూనే, ఈ సినిమాపై వస్తున్న కొన్ని అపోహల్ని ఆయన తొలగించే ప్రయత్నం చేశారు.
‘ఉస్తాద్’ లో ఎక్కడా పొలిటికల్ పంచ్‌లు ఉండవని, పవన్‌కు ఇవన్నీ ఇష్టం ఉండవని, సినిమాని సినిమాలానే చూస్తారని, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారని స్పష్టం చేశారు హరీష్. పవన్ సినిమాల్ని, రాజకీయాల్నీ వేరుగా చూస్తారు అనడానికి ప్రకాష్‌రాజ్ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకొన్నారు. పవన్ కల్యాణ్ అభిప్రాయాలతోనూ, సిద్ధాంతాలతోనూ ప్రకాష్ రాజ్ విబేధిస్తారని, ఇద్దరి మధ్య పార్టీ పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి నటిస్తుంటారని హరీష్ గుర్తు చేశారు. అయితే… హీరోయిజన్ని ఎలివేట్ చేసే డైలాగులు, పంచ్‌లు ఈ సినిమాలో కావల్సినన్ని ఉన్నాయని, బద్దలైపోవడం ఖాయమని.. ఆయన ఫ్యాన్స్‌ని హుషారెత్తించారు.
ఈ వీడియోతో ఒకటి స్పష్టమైంది. `ఉస్తాద్ భగత్ సింగ్` పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. ఇందులో ఎలాంటి పొలిటికల్ పంచ్‌లూ ఆశించకూడదు. ఓరకంగా సినిమాకు ముందే క్లారిటీ ఇచ్చేయడం మంచిదే. ఈ విషయంలో హరీష్ త్వరగానే స్పందించారు.