మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్. మిరపకాయ్, గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్.. సినిమాలతో తాను చూపించింది మాసే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొన్నే బాక్సాఫీసు ముందుకు వచ్చింది. పవన్ అభిమానులకు నచ్చినా… మిగిలిన వాళ్లు పెదవి విరిచారు. పవన్‌ని, ఆయన స్టామినాని సరిగా వాడుకోలేదన్న కామెంట్లు వినిపించాయి. పైగా ఫక్తు సినిమా అనే ముద్ర పడిపోయింది. హరీష్ కూడా ‘నాకు ఇలాంటి సినిమాలే వచ్చు.. నేను ఇలానే తీస్తా’ అని మినమ్రంగా ఒప్పేసుకొన్నారు. `ఉస్తాద్` లెక్కలు మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతాయి. ఈలోగా సినిమాని రకరకాలుగా పోస్టుమార్టమ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
‘ఉస్తాద్’ రిజల్ట్ ప్రభావం అందరికంటే హరీష్ శంకర్‌పైనే ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా హిట్టయితే.. తన బండి మరింత స్పీడందుకొనేది. కానీ ఇప్పుడు డైలామాలో పడిపోయింది. ‘ఉస్తాద్’ తరవాత బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు హరీష్. ఆమధ్య వెళ్లి కథ కూడా చెప్పి వచ్చారు. కథంటే కథ కాదు.. సింపుల్ గా లైన్ అంతే. పూర్తి స్థాయిలో స్క్రిప్టు వినిపించాయి. ‘ఉస్తాద్’ హిట్టయితే బాలయ్య సినిమాకు లైన్ క్లియర్ అయ్యేది. ఇప్పుడు బాలయ్య మైండ్ లో ఏముందో అంచనా వేయలేం. దర్శకుల్ని ఎంచుకొనే విషయంలో బాలయ్య మైండ్ సెట్ అంతా కొత్తగా ఉంటుంది. ఆయన హిట్టూ, ఫ్లాపులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడు. కథ నచ్చాలంతే. దర్శకుడితో తనకు మంచి ట్యూనింగ్ కుదరాలి. హరీష్ తో అది సెట్టయితే… ఏక్షణంలో అయినా పిలుపు రావొచ్చు.
మిడ్ రేంజ్ హీరోలు హరీష్‌కి ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలతో ఆయన ఇది వరకే పని చేశారు. కాబట్టి.. వాళ్లతో మరో స్క్రిప్టు ఓకే చేయించుకోవడం అంత కష్టం కాదు. ‘దాగుడు మూతలు’ అనే స్క్రిప్టు హరీష్ దగ్గర సిద్ధంగా ఉంది. ఆ కథకు ఇద్దరు హీరోలు కావాలి. ఇద్దరు హీరోల్ని వెదుక్కోవడం కంటే సోలో హీరోతో సినిమా చేయడం బెటర్ అనుకొంటే హరీష్ కొత్తగా మరో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే హరీష్‌కు మరో ఛాన్స్ దొరకడం కష్టమేమీ కాదు. సితార లాంటి సంస్థలు హరీష్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాయి. కాకపోతే… ఈసారి ష్యూర్ షాట్ గా హిట్టయ్యే కథ రాసుకోవాలి. ఆ బాధ్యత పూర్తిగా హరీష్ మీదే ఉంది.


