‘రాజాసాబ్’ తరవాత మారుతి సినిమా ఏమిటన్నది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘రాజాసాబ్’ తో జరిగిన డామేజీని మర్చిపోయి వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలెట్టాలని మారుతి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ స్క్రిప్టు తయారు చేసుకొన్నారు మారుతి. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మించాలి. ప్రస్తుతం హీరోలల అన్వేషణలో ఉన్నారు.
ముందుగా వరుణ్ తేజ్ దగ్గరకు ఈ కథ వెళ్లింది. ఆ తరవాత రామ్ పేరు కూడా గట్టిగా వినిపించింది. సాయిధరమ్ తేజ్ తో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. వైష్ణవ్ చాలా కాలంగా కథలు వింటున్నాడు. కానీ ఏదీ ఓకే అవ్వడం లేదు. వరుస పరాజయాల నేపథ్యంలో వైష్ణవ్ కూడా కథల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఈసారి తప్పు చేస్తే కెరీర్ ముగిసినట్టే. అందుకే ఇప్పటి వరకూ ఎన్ని కథలు విన్నా.. ‘ఎస్’ చెప్పలేదు. అయితే ఇప్పుడు మారుతితో ప్రయాణం చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. వైష్ణవ్ కి మారుతి లాంటి దర్శకుడు దొరకడం మంచి ఆప్షనే. కానీ మారుతి.. ఇంకా బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరూ అందుబాటులో లేకపోతే… ఈ కథ వైష్ణవ్ తోనే ముందుకు వెళ్తుంది. 2027 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు.
