ఈ యేడాదికి ఇంకొద్ది రోజుల్లో ‘శుభం’ కార్డు పడిపోతోంది. కొత్త యేడాది పలకరించే లోగా.. 2025 మన కోసం ఏం తెచ్చింది? ఏం ఇచ్చింది? అనే లెక్కలు వేసుకొనే పనిలో పడిపోయాం. టాలీవుడ్ బాక్సాఫీసు ఫలితాలనూ రివ్యూ చేసుకొనే సమయం ఆసన్నమైంది. ఈ యేడాది చాలామంది హీరోల కెరీర్లో స్పెషల్. కొంతమంది హీరోలు హిట్లు కొట్టారు. ఇంకొంతమంది ఫ్లాపులు తగిలించుకొన్నారు. 2025లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీలోలు ఉన్నారు. ఆ లెక్కన ప్రోగ్రెస్ కార్డులో వాళ్లకు ‘జీరో’ మార్కులు వచ్చాయన్నమాట. అలాగని వాళ్లేం పని చేయలేదని కాదు. తమ ప్రాజెక్టులతోనే బిజీగా ఉన్నారు. కానీ సినిమాలు మాత్రం రాలేదు. 2025లో అలా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరోలి లిస్టు ఇదీ…
2025 లో మెగాస్టార్ చిరంజీవి చాలా బిజీగా గడిపారు. విశ్వంభర, మన శివ శంకర ప్రసాద్ గారు సినిమాలతో ఆయన బిజీ. అయితే ఈ క్యాలెండర్ లో మాత్రం ఆయన్నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి వేసవిలో ‘విశ్వంభర’ వస్తుందనుకొన్నారు. కానీ వీఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యమైంది. యేడాది చివర్లో అయినా తీసుకొద్దామనుకొన్నారు. కానీ ‘మన శంకర వర ప్రసాదు’ కోసం వాయిదా వేశారు. సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. ఆ తరవాతే ‘విశ్వంభర’ని చూడొచ్చు. ఆ తరవాత శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేస్తారు చిరు. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు.
మహేష్ బాబు క్యాలెండర్ లో కూడా ఈ యేడాది ఖాళీగా గడిచిపోయింది. గతేడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో పలకరించారు. 2025 రిక్త హస్తాలతో వెళ్లిపోయింది. రాజమౌళి సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు మహేష్. 2026లోనూ ఆయన్నుంచి సినిమా రాదు. అంటే మహేష్‌ని వెండి తెరపై చూడడానికి రెండేళ్ల పాటు ఆగాల్సివస్తోందన్నమాట. కాకపోతే… రాజమౌళి ప్రాజెక్ట్ కాబట్టి, ఆ సినిమా ఎప్పుడొచ్చినా బాత బాకీలన్నీ తీరిపోవడం ఖాయం. మహేష్ కోసం సందీప్ రెడ్డి వంగా ఓ కథ సిద్ధం చేసుకొంటున్నారు. ‘వారణాసి’ తరవాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.
ఈ యేడాది అల్లు అర్జున్ నుంచి కూడా సినిమా రాలేదు. 2024 డిసెంబరులో ‘పుష్ప 2’ వచ్చింది. అంటే బన్నీని వెండి తెరపై చూసి ఏడాది అన్నమాట. ప్రస్తుతం అట్లీ సినిమాతో బన్నీ బిజీ. 2026లో ఈ సినిమాని చూసేయొచ్చు. అట్లీ తరవాత బోయపాటి శ్రీనుతో బన్నీ ఓ సినిమా చేస్తాడని టాక్. ‘సరైనోడు’ కాంబో కాబట్టి… కచ్చితంగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. ‘దేవర’ తరవాత ఎన్టీఆర్ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గరకు రాలేదు. ప్రస్తుతం ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ క్లారిటీ రావాల్సివుంది. ప్రభాస్ ‘రాజాసాబ్’ ఈ యేడాదే రావాలి. కానీ సంక్రాంతికి వెళ్లిపోయింది. 2026లో మాత్రం ‘రాజాసాబ్’తో పాటుగా ‘ఫౌజీ’ కూడా వచ్చేస్తుంది. కాబట్టి డబుల్ బొనాంజా అనుకోవాలి.
స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా కూడా రాకపోవడం లోటే. కానీ ఈ విషయం వాళ్ల చేతుల్లో కూడా ఉండడం లేదు. పాన్ ఇండియా మోజులో ప్రతీ సినిమానీ చెక్కడం మొదలెట్టారు. కథ విని, ఓకే చేసి, సెట్స్ పైకి తీసుకెళ్లడానికి టైమ్ పడుతోంది. వీఎఫ్ఎక్స్ తో పెట్టుకొంటే మరింత లాగ్ వచ్చేస్తోంది. కాబట్టి కెరీర్లో అనుకోని గ్యాప్‌లు వస్తున్నాయి. హీరోలంతా ఈ విషయంలో దృష్టి పెట్టి, తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకొంటే బాగుంటుంది.