గంజాయి కేసులో అరెస్టు అయిన సవింద్రారెడ్డి అనే వ్యక్తి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తన భర్తను నాలుగు గంటలకు అరెస్ట్ చేసి.. ఏడు గంటలకు అరెస్ట్ చేసినట్లుగా చూపించారని ఆయన భార్య హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్టు చేసినప్పటి సిసి ఫుటేజీని సమర్పించింది. అదే సమయంలో సివిల్ డ్రెస్ లో అరెస్టు చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గంజాయి కేసులో సవింద్రారెడ్డి నిందితుడిగా ఉన్నారని పోలీస్ డ్రెస్ లో వెళ్తే పారిపోతాడని మఫ్టీలో వెళ్లామని పోలీసులు చెప్పారు. సీసీ ఫుటేజీ ట్యాంపరింగ్ చేశారని.. ఆయన భార్య కూడా ఆరు గంటలకు కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదు చేసిందని ఆ ఫిర్యాదు లేఖను సమర్పించారు. అయితే న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. ఈ ఘటనపై పోలీసులపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
ఎన్ని గంటలకు అరెస్టు చేశారు. సివిల్ డ్రెస్లో ఎందుకు అరెస్టు చేశారు.. ఈ కేసులో పోలీసులు ఎలా వ్యవహరించరు అన్నది సీబీఐ అధికారులు దర్యాప్తు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సవింద్రారెడ్డిని వైసీపీ తమ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెబుతోంది. ప్రభుత్వంపై పోస్టులు పెడుతున్నారని ఆయనను అరెస్టు చేసిందని .. హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని .. తప్పుడు అరెస్టు చేసిన పోలీసుల్ని వదిలేది లేదని హెచ్చరించింది. సవింద్రారెడ్డి అనే వ్యక్తి వైసీపీ మార్క్ సోషల్ మీడియా పోస్టులతో బూతులతో దాడి చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు వ్యవహారంపై మూడు నాలుగు రోజుల నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ హాయాంలో కొన్ని వందల మంది టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసి గంజాయి కేసుల నుంచి రకరకాల కేసులు పెట్టారు. వారంతా సోషల్ మీడియా కార్యకర్తలే. అయితే ఎప్పుడూ టీడీపీ న్యాయవిభాగం ఆ కేసులు పోలీసులు పెట్టినవని కోర్టును కన్విన్స్ చేసి సీబీఐ విచారణ వేయించుకోలేకపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తమ కార్యకర్త అరెస్టుపై సీబీఐ విచారణ వచ్చేలా చేసుకున్నారు. సవింద్రారెడ్డి కేసును పొన్నవోలు సుధారక్ రెడ్డి వాదించలేదని తెలుస్తోంది.