హైకోర్టు షాక్..! చంద్రబాబు భద్రతపైన నెగ్గని జగన్ సర్కార్ పంతం..!

చంద్రబాబు భద్రతను.. టూ ప్లస్ టూకి కుదించేసి… ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా ఇస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలోలా… 97మందితో భద్రత కల్పించాల్సిందేనని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత .. టీడీపీ నేతలెవరికీ ముఖ్యంగా.. చంద్రబాబుకు భద్రత అవసరం లేదన్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యవహరించింది. మొదటగా.. ఎస్కార్ట్ వాహనాన్ని.. తర్వాత జామర్, రూట్ క్లియరెన్స్ వాహనాన్ని తొలగించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ మినహాయింపు కూడా తొలగించారు. చివరికి… ఆయనకు.. టూ ప్లస్ టూ సెక్యూరిటీని మాత్రమే మిగిల్చారు. గతంలో వైఎస్ హయాంలో జరిగిన రాజకీయ దాడులు .. ప్రస్తుతం జగన్ సీఎం అయిన తర్వాత ఏర్పడిన పరిస్థితులతో.. ఆందోళన చెందిన టీడీపీ నేతలు..భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్న కారణంతో.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతకు నిబంధనలకు అనుగుణంగా 70 మందికిపైగా సిబ్బందితో.. భద్రత కల్పిస్తున్నామని వాదించింది. అయితే.. ఆ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేయలేదు.

ఈ 70 మందిలో.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వారే అత్యధికం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం.. అతి కొద్ది మందే ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించాల్సి వచ్చింది. పర్యటనల్లో ఉన్నప్పుడు.. ఇతర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు.. భద్రత మొత్తం.. ఏపీ సర్కార్ దే .. ఏపీ సర్కార్ కేటాయించే భద్రతా సిబ్బందిదే. అయితే.. చంద్రబాబుకు.. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్నందున.. ఏపీ ప్రభుత్వం తరపున ఎలాంటి భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వాదించారు. కానీ.. ఈ వాదనను ప్రభుత్వం తన తీర్పు ద్వారా తోసిపుచ్చింది. గతంలో కేటాయించినట్లుగా 97మందితో భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

చంద్రబాబు భద్రత వ్యవహారంలో..ప్రభుత్వం వ్యవహరించిన తీరు మొదటి నుంచి విమర్శలకు కారణం అవుతోంది. వైఎస్ హయాంలోనూ.. చంద్రబాబుకు కల్పించిన భద్రతపై విమర్శలు రాలేదు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం..ఓ పద్దతి ప్రకారం.. చంద్రబాబు భద్రతను.. ఆయన కుటుంబ సభ్యుల భద్రతనూ తగ్గిస్తూ వచ్చారు. చివరికి న్యాయస్థానంలో.. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పలేదు. అత్యంత సున్నితమైన విషయంలో.. ప్రభుత్వం ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నా .. రాజకీయంగా చంద్రబాబు …టీడీపీ స్థైర్యంపై దెబ్బకొట్టడానికే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వచ్చాయి. అయితే..మొదటి నుంచి ఏపీ సర్కార్.. హైకోర్టుకు కూడా.. ఈ విషయంలో.. సరైన సమాచారం ఇవ్వలేదు. మరి ఆదేశాలనైనా పాటిస్తుందో లేదోనని టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com