రెంటికి చెడ్డ రేవడిగా మారాననే వంశీలో ఇంత అసహనం…!?

కృష్ణా సినిమాలో ఓ సీన్ ఉంటుంది. వేణుమాధవ్‌తో ఇల్లు ఖాళీ చేయించడానికి.. రవితేజ అండ్ బృందం.. ఆయన మిత్రులుగా పరిచయం చేసుకుని.. వేణుమాధవ్‌ను ఆవేశపరిచి.. ఇంటి ఓనర్ అయిన బ్రహ్మానందంపై తిరగబడేలా చేస్తుంది. తర్వాత తామే దగ్గరుండి ఇల్లు ఖాళీ చేయించి.. నడి రోడ్డు మీద వదిలి పెట్టి వెళ్లిపోతుంది. దిక్కు లేకుండా అయిపోతాడు వేణుమాధవ్. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తూంటే.. అంతే అనిపిస్తోందంటున్నారు. ఆయన టీడీపీపై ఆవేశపడేలా చేశారు. దాని కోసం ఆయన ఇంత కాలం.. తాను దాచుకున్న డిగ్నిటీని కూడా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు.. చేర్చుకోవాల్సిన పార్టీ.. తామెప్పుడు చేర్చుకుంటామని హామీ ఇచ్చామని ప్రశ్నిస్తోంది. అంటే సీన్ అర్థమైపోయినట్లే కదా..!

వంశీతో సంబంధం లేదని వైసీపీ ఎందుకు వాదిస్తోంది..?

మొన్న..!
జగన్‌తో కలిసి నడుస్తా..! త్వరలో వైసీపీలో చేరుతా..?
నిన్న
జగన్ పార్టీలో చేర్చుకుంటారని హామీ ఇచ్చారని నేను చెప్పానా..?

రెండు రోజుల్లో వల్లభనేని వంశీ మాటల్లో వచ్చిన తేడా ఇది. ఈ మాటల ఒత్తిళ్లనుంచే.. ఆయనలో అసహనం తన్నుకొస్తోంది. ఆ విషయం కంట్రోల్ తప్పి మాట్లాడుతున్న ఆయన మాటల్లోనే వెల్లడవుతోంది. టీడీపీకి దూరయ్యారు. కానీ వైసీపీ తలుపులు తెరుస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు దీక్ష రోజున వంశీ ప్రెస్‌మీట్ పెట్టి.. చంద్రబాబును చెడామడా తిట్టి.. తాను వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఇదే ఆ పార్టీని ఉలిక్కి పడేలా చేసింది. తాము ఎప్పుడు చేర్చుకుంటామని చెప్పామని పరోక్షంగా మీడియా ద్వారానే ప్రశ్నించింది. కొడాలి నాని కూడా నేరుగా వంశీని చేర్చుకోలేదని ప్రకటించారు. దీంతో.. వంశీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

టీడీపీని వదిలేశారు.. వైసీపీ తలుపులు తెరవలేదనేనా అసహనం..!

అందుకే తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో ఆయన ఆత్మవంచన చేసుకుంటున్నారనే విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. బలమైన వాదన వినిపించలేకపోతున్నారు. గతంలో వైసీపీలో చేరికపై ఆయన అన్న మాటలకు.. టీడీపీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన అంటున్న మాటలకు పొంతనే లేదు. అప్పుడు వైసీపీని అయినా.. ఇప్పుడు టీడీపీని అయినా..అంత తీవ్రంగా విమర్శించిన అవసరంలేదు. కానీ.. ప్రత్యర్థి పార్టీ కాబట్టి.. తాను ఉంటున్న పార్టీని సంతృప్తి పరచాలంటే.. నాడు వైసీపీని విమర్శించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు… ఇంత కాలం.. రాజకీయ అండనిచ్చిన.. టీడీపీని.. ఆ పార్టీ అధినేతను.. అసభ్యంగా దూషించాల్సిన అవసరం ఏమిటనేది ఆయన అనుచరుల సందేహం. టీడీపీ నుంచి చాలా మంది ఇతర పార్టీలకు వెళ్లారు కానీ.. ఎవరూ.. వంశీ లా మాట్లాడలేదు. అందుకే వంశీ తీరుపై.. ఒక్క సారిగా టీడీపీలోనూ.. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనకు సానుభూతి కూడా రావడం లేదు.

రాజీనామాపై వితండ వాదన … మళ్లీ గెలవలేననే అపనమ్మకమేనా..?

రాజీనామా చేయమని లోకేష్ డిమాండ్ చేశాడని..ఆయనపై మరింత దారుణమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. టీడీపీ గుర్తుపై పోటీ చేశారు. ఆ పార్టీ ఫండ్ అందుకుని.. ఎన్నికల్లో ఖర్చు పెట్టానని కూడా అంగీకరించారు. అలాంటప్పుడు..కచ్చితంగా… వంశీ గెలుపు.. తెలుగుదేశం పార్టీదే. అలా కాదని వాదిస్తున్నందుకు.. దాన్ని నిరూపించుకునేందుకైనా.. రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాల్సింది. అలా కాకుండా.. లోకేష్‌ను రాజీనామా డిమాండ్ చేయడం.. విచిత్రం. వల్లభనేని వంశీ ఉదాహరణగా చెప్పిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్.. బీజేపీలో చేరాడు కాబట్టే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయినందుకు కాదు. దీన్ని ఎందుకు వంశీ అంగీకరించలేకపోతున్నారు..? రాజీనామా చేస్తే మళ్లీ గెలవనని భయపడుతున్నారా..? అనే విమర్శలు సహజంగానే ప్రారంభమయ్యాయి.

రేపు మమ్మల్ని అలా తిట్టరని గ్యారంటీ ఏమిటంటున్న వైసీపీ నేతలు..!

టీడీపీలో ఉండగా.. వల్లభనేని వంశీ వ్యవహారశైలి అందరికీ తెలుసు. పార్టీ కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌ను.. కొడాలి నాని స్నేహాన్ని.. వదిలేసుకున్నానని గొప్పగా ప్రకటించుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల ప్రాపకం కోసం.. ఆయన వారి వెంట ఎలా తిరిగేవారో.. టీడీపీలో అందరూ కథలు కథలుగా చెబుతారు. ఇదే విషయాలను…. యలమంచిలి రాజేంద్రప్రసాద్ చెబితే.. కోపం వచ్చి తిట్టేశాంటున్నారు. ఎప్పుడు వెళ్లినా చంద్రబాబు కాళ్లకు వంశీ నమస్కారం పెడతారు. ఇప్పుడు.. చంద్రబాబు నా తండ్రి లాంటి వారు…కాళ్లకు దండం పెడితే తప్పేంటి అని సమర్థించుకున్నారు. మరి తండ్రి లాంటి వారికి.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వారికి.. ఇచ్చే గౌరవం ఇదేనా..? కన్నతల్లిదండ్రుల పట్ల కూడా ఇందే వ్యవహరించరని గ్యారంటీ ఏముంది..? రేపు జగన్‌తో తేడాలొస్తే.. ఇంత కన్నా ఎక్కువ తిట్టరని గ్యారంటీ ఏముందని వైసీపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అనవసర ఆవేశంతో..వంశీ సెల్ఫ్ గోల్..!?

మొత్తానికి అత్యుత్సాహామో… మరో కారణమో కానీ.. వంశీ.. పొలిటికల్ గా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఆయనను ఎవరూ నమ్మని …నమ్మలేని పరిస్థితి .. రెండు రోజుల్లోనే తెచ్చుకున్నారంటున్నారు. ఓ వైపు.. ఇంత కాలం ఆదరించిన టీడీపీని చెడామడా తిట్టేసి.. రేపు చేరబోయే పార్టీలోనూ.. అనుమాన బీజాల్ని లెవనెత్తారు. రేపు తేడా వస్తే.. తమకూ వంశీ ఆ ట్రీట్‌మెంట్ ఇవ్వరని గ్యారంటీ ఏమిటన్నది..వారి సందేహం. గతంలో అలా తిట్టి ఉన్నారు మరి..! ఆ అసహనమే.. వంశీ… నోటి ద్వారా బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com