హిట్ 2′ ట్రైల‌ర్‌: ‘కోడి బుర్ర’ ఎంత ప‌దునో తెలుసా..?

దొంగ – పోలీస్ ఆట‌లో.. ఎవ‌రి ధైర్యం వాళ్ల‌ది. ఎంత పెద్ద త‌ప్పు చేసినా – ఈజీగా త‌ప్పించుకోవ‌చ్చ‌న్న ధీమా దొంగ‌దైతే, ఎంత పెద్ద దొంగైనా చిన్న త‌ప్పు చేసి దొరికిపోతాడు అనే ధీమా పోలీస్‌ది. `హిట్ 2`లో కేడీ (అడ‌విశేష్‌)దీ అదే ధైర్యం. సిటీలో ఓ దారుణ‌మైన‌ మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. హంత‌కుడ్ని ప‌ట్టేసుకొంటాన‌న్న అతి ధీమాతో `క్రిమిన‌ల్స్ వి కోడి బుర్ర‌లు.. 5 నిమిషాలు చాలు వీళ్ల‌ని ప‌ట్టుకోవ‌డానికి` అని తేలిగ్గా తీసుకొంటాడు ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ కేడీ. అదే… ఆ క్రిమిన‌ల్ ని ఉడికిస్తుంది. త‌న కోడి బుర్ర ప‌దునెంతో… చూపించాల‌నుకొంటాడు. ఆ త‌ర‌వాత‌… ఏం జ‌రిగింద‌న్న‌ది… `హిట్ 2` చూసి తెలుసుకోవాలి.

నాని నిర్మాత‌గా తెర‌కెక్కించిన `హిట్` మంచి విజ‌యాన్ని అందుకొంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా `హిట్ 2` వ‌స్తోంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఆడ‌వి శేష్ క‌థానాయకుడు. డిసెంబ‌రు 2న విడుద అవుతోంది. ఈరోజు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా…సీరియ‌స్‌గా సాగింది. ఓ మ‌ర్డ‌ర్ కేసు ఇన్వెస్టిగేష‌న్ మొద‌లెట్టిన హీరోకి, అడుగ‌డుగునా అవాంత‌రాలు ఎదురైతే, దారుల‌న్నీ మూసుకుపోతే, క్రిమిన‌ల్ స‌వాళ్లు విసురుతుంటే… ఏం జ‌రిగింద‌న్న‌ది ఉత్కంఠ భ‌రితంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, విజువ‌ల్స్ ఓ ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లిగించాయి. హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది ట్రైల‌ర్‌లో చూపించ‌లేదు. సినిమాలో కూడా అదే పెద్ద ట్విస్ట్ కావొచ్చు. హిట్ లా హిట్ 2 కూడా… హిట్టు కొట్టి, హిట్ 3కి బాట‌లు వేసేలానే క‌నిపిస్తోంది ట్రైల‌ర్‌. పైగా అడ‌విశేష్ మంచి స్పీడు మీద ఉన్నాడు. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే… త‌న ఖాతాలో మ‌రో హిట్టు గ్యారెంటీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.