రివ్యూ : HIT – ది సెకండ్ కేస్

HIT2 Movie review

తెలుగు360 రేటింగ్ 2.75/5

నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థలకి ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఆసక్తికరంగా చూపించాలే గానీ ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధమే. హీరో నాని నిర్మాతగా మారి ఈ జోన‌ర్‌లో HIT (హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌) చిత్రాన్ని నిర్మించాడు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా వచ్చిన HIT మంచి విజయాన్ని అందుకుంది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో దర్శకుడు శైలేష్ కొల‌ను HIT ని ఒక యూనివర్స్ ఫ్రాంచైజీగా మార్చి అడివి శేష్ కథానాయకుడిగా ‘HIT ది సెకండ్ కేస్’ ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి అడివి శేష్ స్పెషలిస్ట్. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించింది. ఇంతలా క్యురియాసిటీని పెంచిన HIT 2 థియేటర్లో ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? నేర ప‌రిశోధ‌న ఎంత ఉత్కంఠగా సాగింది ?

కేడీ అలియాస్ కృష్ణదేవ్ (అడివి శేష్) విశాఖపట్నంలో హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తుంటాడు. ఆర్య (మీనాక్షి చౌదరి)తో రిలేషన్ షిప్ లో ఉంటాడు. కేడీ చాలా షార్ఫ్. నేరస్తలని నిమిషాల్లో పసిగట్టేస్తుంటాడు. ఒక కేసులో నేరస్తుడు ఎవరో ఒక్క ఫోన్ కాల్ తో తేల్చేస్తాడు. ఇంత త్వరగా నేరస్థుల్ని ఎలా పట్టుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘క్రిమినల్స్ వి కోడి బుర్రలు. వాళ్ళని పట్టుకోవడాని పెద్ద సమయం అవసరం లేదు” అంటాడు. ఆ తర్వాతరోజే.. సంజన అనే అమ్మాయి దారుణంగా హత్యకు గురౌతుంది. ఆ అమ్మాయిని ఎవరో ముక్కలుగా నరికేస్తారు. ఈ కేసు కేడీ దగ్గరకి వస్తుంది. అసలు చంపింది సంజన ఒక్కరే కాదని, మొండెం, కాళ్ళు, చేతులు మరో ముగ్గురు అమ్మాయిలవి ఫోరెన్సిక్ టెస్టులో తేలుతుంది. ఈ కేస్ ని కెడీ ఎలా డీల్ చేశాడు ? తనకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ? అసలు కిల్లర్ ఎవరు? అనేది మిగతా కథ.

ఇదో సైకో కిల్లర్ కథ. రెగ్యులర్ సైకో థ్రిల్లర్ టెంప్లెట్ లోనే ఈ కథని రాసుకున్నారు. కేడీని పరిచయం చేసే సన్నివేశం.. అతని పాత్ర, తెలివి తేట‌ల‌పై అంచనాలు పెంచుతుంది. ఏమాత్రం కాల‌క్షేపం చేయ‌కుండా నేరుగా క‌థలోకి వెళ్లిపోయాడుద‌ర్శ‌కుడు. సంజ‌న హ‌త్య‌తో… హ‌డావుడి మొద‌లైపోతుంది. ఆ హ‌త్య ఎంత క్రూరంగా ఉంటుందంటే… ఆ హంత‌కుడు ఎవ‌రో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ముందే మొద‌లైపోతుంది. అయితే అసలు కేసు మొదలైన తర్వాత మాత్రం కెడీ ఇంటెల్జెన్స్ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. నేర ప‌రిశోధ‌న లో వేగం వుండదు. ఇలాంటి కథలలో సైకో కిల్లర్ ఎలాంటి ఎత్తులు వేస్తాడు, దానికి పైఎత్తు ఎలా వుంటుందనేది ప్రేక్షకులని యంగేజ్ చేస్తుంది. కేసు మొదలైన తర్వాత కేడీ నిధానంగా విచారించుకుంటూ వెళ్తుంటాడు తప్ప.. ఎక్కడా సీట్ ఎడ్జ్ థ్రిల్స్ వుండవు. కాక‌పోతే… మ‌రీ విసుగెత్తించే ఫార్ములాలోనూ ఉండ‌దు. కథలో చాలా పాత్రలపై అనుమానం రేకెత్తించడం ఈ జోనర్ సినిమాల్లో కీలకం. అయితే ఇందులో ఇంటర్వెల్ వరకూ కేవలం రాఘవుడు అనే పాత్రపైనే ఫోకస్ పెట్టేశారు. రాఘవుడు అమాయకుడని జీవితంలో మొదటిసారి థ్రిల్లర్ సినిమా చూసే ప్రేక్షకుడికి సైతం తెలుస్తుంది. కానీ చాలా తెలివైన కేడీ మాత్రం.. రాఘవుడినే పట్టుకుంటాడు. అతడ్నే దోషిగా నిలబెడతాడు. సైకో చెబితే కానీ రాఘవుడు అమాయకుడనే సంగతి కేడీ అర్ధం కాదు. అసలు సైకో మోటో ఏంటో తెలియకుండానే ఇంటర్వెల్ పడిపోతుంది. తొలి స‌గంలో కొన్ని ముడులు బాగానే వేసుకోగ‌లిగాడు ద‌ర్శ‌కుడు. దాంతో రెండో భాగంపై ఆశ‌లు, అంచ‌నాలు పెరుగుతాయి.

ద్వితీయార్ధంలో కూడా విచారణకే ఎక్కువ సమయం కేటాయించారు. హంత‌కుడు ఎవ‌రో.. చివ‌రి వర‌కూ దాచి ఉంచాడు. హిట్ తొలి భాగంలోని కొన్ని రిఫరెన్స్ లో ఈ కథలో భాగం చేశారు. అవి క‌ళ్ల ముందు క‌నిపించిన‌ప్పుడు ప్రేక్ష‌కుల్లో ఓ ఎక్స‌యిట్‌మెంట్ వ‌స్తుంది. దాన్ని బ‌ట్టి `హిట్‌` ఫ్రాంచైజీ జ‌నంలోకి ఎంత వెళ్లిపోయిందో అర్థ‌మ‌వుతుంది. ఈ కేసు విచారణలో కొన్ని లూజ్ ఎండ్స్ వున్నాయి. లోపాలూ.. ఉదాహరణకు సంజన మెడపై పన్ను పై పన్ను వున్న వ్యక్తి కరిచినట్లుగా ఒక క్లూ దొరుకుతుంది. దాన్ని లీడ్ గా పట్టుకొనే విచారణ జరుపుతారు. అయితే చివర్లో అది పళ్ళ సెట్ తో చేసిన కాటు అన్నట్టుగా చూపిస్తారు. ఒరిజినల్ పళ్ళకి, కృత్రిమ పళ్ళ సెట్ కాటుకి తేడా తెలియకుండా ఫోరిన్సిక్ రిపోర్ట్ ఇస్తారా ? అనే సందేహం కలుగుతుంది. అలాగే కేడీ, సంజన స్నేహితురాల్ని విచారిస్తున్నపుడు ఆమె ధోరణి అనుమానంగా వుంటుంది. సంజన గురించి ఆమె చెప్పిన విషయాలు డౌట్ ని క్రియేట్ చేస్తాయి.? అలాగే వీరరాఘవుడు ”అది నా పర్శనల్ మేటర్ ‘ అని పదేపదే చెబుతుంటాడు. వీటిలో ఏదో మతలబు వుందని ప్రేక్షకుడికి అర్ధమౌతుంటుంది కానీ ఎంతో తెలివైన కేడీకి మాత్రం అర్ధకాకపోవడమే విచిత్రం. ఇలాంటి కథల్లో దర్శకుడికి అనుకూలంగా విచారణ నడిపేయడం అంత తెలివైన పనికాదు.

ఇక ఫైనల్ గా.. సైకో చివరి సీన్ లో దొరుకుతాడనే రూలు ప్రకారమే సైకో రివిల్ చేశారు. సైకో ఎంట్రీ షాక్ ఇచ్చేదే. స‌ద‌రు సన్నివేశంలో సైకో న‌టుడి.. బాడీ లాంగ్వేజ్ బాగుంది. హీరోకీ, సైకోకి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ కూడా ర‌క్తి క‌ట్టిస్తుంది. చివర్లో సైకోని రెచ్చగొడుతూ కేడీ ఆడిన మైండ్ గేమ్ రాక్షసుడు సినిమాలో చూసిందనే ఫీలింగ్ ని ఇస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్ విష‌యానికొస్తే… థ్రిల్ల‌ర్ టెంప్లేట్ ని తూ.చ త‌ప్ప‌కుండా ఈ సినిమా ఫాలో అయిపోయింది. క‌థ‌లో ప‌క్క చూపులు చూళ్లేదు. సినిమా అంతా ఒకే థ్రెడ్ పై న‌డుస్తుంటుంది. ఆఖ‌రికి పాట‌ల‌కూ చోటు ఇవ్వ‌లేదు. స్క్రీన్ ప్లే రేసీ రేసీగా సాగిపోవ‌డంతో కొన్ని లోపాలు క‌నిపించ‌కుండా పోతాయి. దానికి తోడు.. మేకింగ్ బాగా కుదిరింది. క‌ల‌ర్ స్కీమ్‌, లైటింగ్‌, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ త‌ప్ప‌కుండా నాణ్య‌మైన సినిమా చూస్తున్నామ‌న్న ఫీలింగ్ క‌లిగించింది. పైగా చిన్న చిన్న పాయింట్లు తొలి స‌గంలో చూపించి.. వాటిని రివీల్ చేయ‌డం, స‌రైన స‌మ‌యంలో వాడుకోవ‌డం ఇంకాస్త బాగున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. కేడీకి విజిల్ వేయ‌డం రాద‌న్న విష‌యం తొలి స‌న్నివేశాల్లో చూపిస్తారు. దాన్ని స‌రైన ప్లేస్ మెంట్ లో మ‌ళ్లీ తీసుకురావ‌డం ద‌ర్శ‌కుడి తెలివితేట‌ల్ని చూపించే విష‌య‌మే. అలానే… హీరోయిన్ ఓ డైరీ మెయింటైన్ చేస్తుంది. దాన్ని క్లూలో భాగంగా వాడుకోవ‌డం బాగుంది.

అడవి శేష్ మంచి ఫామ్ లో వున్నాడు. థ్రిల్లర్స్ శేష్ కి అలవాటే. కేడీ పాత్రని చాలా ఈజ్ తో చేశాడు. అతని పాత్ర స్టయిల్, మంచి ఫన్ వుంది. తనదైన బాడీలాంగ్వెజ్ తో ఆకట్టుకున్నాడు. నిదానంగా సాగిన ఈ కేసు విచారణలో ప్రేక్షకుడిని యంగేజ్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే అది శేష్ స్క్రీన్ ప్రజన్స్ నే. మీనాక్షి చౌదరి అందంగా కనిపించింది. ఆ పాత్రని కూడా కథలో భాగం చేశారు. రావు రమేష్, తనికెళ్ళ భరణి పోసాని, శ్రీకాంత్ అయ్యంగర్ పాత్రోచితంగా చేశారు.

వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. ఈ కథ మూడ్ కి తగ్గ విజువల్స్ క్రియేట్ చేయడంలో సాంకేతిక బృందం మంచి పనితీరు కనబరిచింది. మణికందన్ సినిమాటోగ్రఫీ ఒక ప్రత్యేక ఆకర్షణ. చాలా సన్నివేశాల్లో ఆయన చేసిన లైటింగ్ ఆకట్టుకుంది. ఎడిటర్ గ్యారీ బిహెచ్ కథని గ్రిప్పింగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎంఎం శ్రీలేఖ ఇచ్చిన పాట పర్వాలేదనిపించాయి. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం బావుంది. దర్శకుడు శైలేష్ కొల‌ను క్రైమ్ థ్రిల్లర్ కు సరిపడా కథనే రాసుకున్నాడు. అయితే దాని ఊహకందని మలుపులతో యంగేజింగా ప్రజంట్ చేయడంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఈ సినిమా ట్రైలర్ చాలా అంచనాలు పెంచింది. ఆ అంచనాలతో కాకుండా మాములుగా ఓ కొత్త సినిమా చూద్దామని వెళితే మాత్రం నిరాశ వుండదు.

తెలుగు360 రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close