దెయ్యాలు, ఆత్మలు.. ఇవెప్పుడూ మిస్టరీ సబ్జెక్టులే. ఆత్మలున్నాయంటే నమ్మని వాళ్లు ఎంత మంది ఉన్నారో, నమ్మేవాళ్లు అంతేమంది ఉన్నారు. దెయ్యాలంటే ఏమాత్రం నమ్మకం లేని వాళ్లు కూడా హారర్ సినిమాల్ని ఇష్టపడుతుంటారు. అందుకే ఈ తరహా కథలకు గిరాకీ ఎక్కువ. ఇటీవల పొలిమేర, మసూధ లాంటి హారర్ సినిమాలు విజయవంతమయ్యాయి. పరిమితమైన బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రాలు, నిర్మాతలకు భారీ లాభాల్ని అందించాయి. అందుకే హారర్ సినిమాల వైపు మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ పరంపరలో ‘ఈషా’ అనే మరో సినిమా వస్తోంది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఈనెల 12న విడుదల అవుతోంది.
కె.ఎల్, దామెదర ప్రసాద్, బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. బన్నీ వాస్, వంశీ నంది పాటి.. ఇద్దరూ ఫామ్ లో ఉన్న నిర్మాతలే. వీళ్ల భాగస్వామ్యంలో వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ బాగా ఆడింది. దాంతో.. `ఈషా`పై కూడా నమ్మకాలు పెరిగాయి. హారర్ సినిమాలో కొన్ని హైస్, థ్రిల్స్ చాలా అవసరం. ట్రైలర్ లో వాటిని బాగా పొందుపరిచారు. సౌండ్ తో కంటే, కంటెంట్ తో భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మలు, క్షుద్ర పూజలు.. వీటి చుట్టూనే కథ నడుస్తున్నట్టు కనిపించినా, వాటికి మించిన మరో కొత్త లేయర్ ఏదో కథలో ఉందని అనిపిస్తోంది. కొన్ని షాట్స్ నిజంగానే వణుకు పుట్టేలా డిజైన్ చేశారు. ‘పిరికివాళ్లు, బలహీనులు, భయపడేవాళ్లు ఈ సినిమా చూడొద్దు’ అంటూ చిత్రబృందం కూడా హెచ్చరిస్తోంది. చిన్న సినిమాలకు ప్రమోషన్లు చాలా అవసరం. దానికి తగ్గట్టుగానే ‘ఈషా’ టీమ్ ప్రమోషన్ల విషయంలో జోరు పెంచింది. ఈవారం కొత్త సినిమాల తాకిడి బాగానే ఉంది. వాటి మధ్య ఈ హారర్ సినిమా ఏమేరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.
