వచ్చే వారం విడుదల కానున్న హిందీ సినిమా “హౌస్ ఫుల్ 5” లో రెండు వేర్వేరు క్లైమాక్స్ లు ఉంటాయని, వేరు వేరు థియేటర్లలో చూసిన ప్రేక్షకుల కు వేరు వేరు క్లైమాక్స్ సీన్లు ప్రదర్శితమవుతాయని, ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా జరుగుతున్న ప్రయోగమని ఆ సినిమా నిర్మాత సాజిద్ నడియావాలా ఇటీవల ప్రకటించారు. నిర్మాత మాట్లాడుతూ, ఈ ఆలోచన తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉందని, ఒక మిస్టరీ సినిమా ని ఒక థియేటర్లో చూసిన ప్రేక్షకులకు ఒక క్యారెక్టర్ ని హంతకుడిగా చూపించి, ఇంకొక థియేటర్లో చూసిన ప్రేక్షకులకు ఇంకొక క్యారెక్టర్ని హంతకుడిగా చూపించి, రెండు భిన్నమైన క్లైమాక్స్లను ప్రేక్షకులను ఒప్పించేలా తీయాలన్నది తన ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన సినిమాపై కొంత ఆసక్తి పెంచిన సంగతి వాస్తవమే అయినప్పటికీ, ఇలా ఒకే సినిమా రెండు వేర్వేరు క్లైమాక్స్ లు కలిగి ఉండడం కొత్తేమీ కాదు.
1998 “హరికృష్ణన్స్”
“హరికృష్ణన్స్” అనే పేరుతో వచ్చిన ఈ మలయాళ సినిమా 1998లో రిలీజ్ అయింది. మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి జుహీ చావ్లా హీరోయిన్ గా నటించింది. దీనికి దర్శకుడు ఫాజిల్. తెలుగు ప్రేక్షకులకు ఈయన నాగార్జున నటించిన “కిల్లర్” సినిమా దర్శకుడిగా పరిచయం. రజనీకాంత్ చంద్రముఖి సినిమా కి మాతృక అయిన మణి చిత్ర తాజు సినిమాతో అప్పటికే ఇంటలెక్చువల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఫాజిల్ – ఇలా ఒకే సినిమాకు రెండు విభిన్నమైన క్లైమాక్స్ ల ప్రయోగం చేస్తున్నాడని ప్రకటించగానే అప్పట్లో సినీ ప్రేమికులందరూ ఆ ప్రయోగం ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే క్రైమ్ మిస్టరీగా వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ మరియు మమ్ముట్టి ఇద్దరూ హీరోయిన్ అయిన జుహీ చావ్లా తో ప్రేమలో పడగా, క్లైమాక్స్ లో హీరోయిన్ వీరిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే సమస్యను పరిష్కరించడానికి ఒక ఆకు తో టాస్ వేస్తుంది. అవును, మీరు కరెక్ట్ గానే చదివారు. కొన్ని థియేటర్ల లో ఆ టాస్ ప్రకారం చివరకి జుహీ చావ్లా మోహన్ లాల్ ని పెళ్లి చేసుకుంటే, ఇంకొన్ని థియేటర్లలో టాస్ మమ్ముట్టి కి అనుకూలంగా రావడం తో, అదే టాస్ ప్రకారం చివరకి జుహీ చావ్లా మమ్ముట్టి ని పెళ్లి చేసుకుంటుందన్నమాట!!
ఫాజిల్ లాంటి తెలివైన దర్శకుడు రెండు వేరు వేరు క్లైమాక్స్ ల ప్రయోగాన్ని మోహన్ లాల్ మరియు మమ్ముట్టి ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి వాడుకోవడాన్ని అప్పట్లోనే సినీ విమర్శకులు తూర్పారపట్టారు. పైగా ఈ ప్రయోగం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హిందూ మతస్తుల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హీరోయిన్ మోహన్ లాల్ ని పెళ్లి చేసుకున్నట్టుగాను, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హీరోయిన్ మమ్ముట్టిని పెళ్లి చేసుకుంటున్నట్టుగాను చూపించారని, ప్రేక్షకులను ఈ సినిమా మత ప్రాతిపదికన విడగొట్టిందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలని సినిమా యూనిట్ ఖండించిందనుకోండి, అది వేరే విషయం. ఇంతలో సెన్సార్ బోర్డు జోక్యం చేసుకొని, తమ వద్ద అనుమతి పొందిన కాపీలో క్లైమాక్స్ లో మోహన్ లాల్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉందని, మమ్ముట్టి పెళ్లి చేసుకుంటున్నట్టు చూపిస్తున్న సీన్లు సెన్సార్ అనుమతి పొందలేదని, కాబట్టి వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్మాతలు కూడా ఏమాత్రం తగ్గకుండా కోర్టుకు వెళ్లారు. ఈ మొత్తం వివాదాల కారణంగా ఆ సినిమాకి కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే ఇప్పుడు వస్తున్న హౌస్ ఫుల్ 5 సినిమాకు మాత్రం, “హరికృష్ణన్స్” సినిమా వలె కాకుండా, విభిన్న క్లైమాక్స్లను అన్నింటిని ముందే సెన్సార్ కి చూపించి అనుమతి తీసుకుంటారని తెలుస్తోంది. మరి ఈ ప్రయోగం ఈ బాలీవుడ్ సినిమాకు కలెక్షన్లను కురిపిస్తుందా అన్నది వేచి చూడాలి. కానీ ఇటువంటి ప్రయోగం తామే మొదటి సారి చేస్తున్నామంటూ హౌస్ ఫుల్ సినిమా యూనిట్ చేస్తున్న ప్రచారం మాత్రం వాస్తవం కాదు.
– జురాన్ (@CriticZuran)