ఎక్కడో ప్రకాశం జిల్లాలో వ్యక్తిగత కారణాలతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని హత్య చేసుకున్నారు. వారు వేర్వేరు కులాలు . ఆ కులాల గురించి వారే పట్టించుకోలేదు. ఆర్థిక సంబంధాలు పెట్టుకున్నారు. కానీ అక్కడే గొడవలు వచ్చాయి. అవి పెద్దవయ్యాయి. నేరం జరిగింది. కానీ వారి మధ్య లేని కుల గొడవలు.. రాష్ట్రం మొత్తం పెట్టాలని కొంత మంది బయలుదేరారు. ఏఐ వీడియోలతో వచ్చేశారు. ఇలాంటి గొడవలు పెట్టాలనుకునేవారు వైసీపీ వాళ్లు.. వాళ్లకు తోడు ఇతరులు కూడా బయలుదేరడమే అసలు విషాదం.
ఆర్థిక లావాదేవీలతో గొడవలు – హత్య
కందుకూరులో జరిగిన హత్య ఘటనలో ఉపయోగించిన కారుపై కులం పేరు ఉందని.. ఏఐ ఫోటోలతో ప్రారంభించి… టీడీపీ, జనసేన మధ చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అదే సందు అని.. జనసేన పార్టీ సానుభూతిపరుల పేరుతో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. ఆ పార్టీ సానుభూతి పరుల సోషల్ మీడియా అకౌంట్లలో .. యూట్యూబ్ చానల్స్ లో ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి మనుషుల్ని కూడా ఏఐ తయారు చేసి వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ జనసేన పార్టీ సానుభూతిపరులు తమ పార్టీకి మేలు చేస్తున్నట్లా?
ప్రతీ నేరానికి కులం ఎలా కారణం అవుతుంది?
ఏపీలో జరిగే నేరాలకు కులం అంటిస్తున్నారు కానీ.. నేరాలకు మాత్రం ఆర్థిక, అక్రమ సంబంధాలే ఎక్కువగా కారణం అవుతాయి. కులం కారణంగా నేరాలు జరగవు.
ఓ కులం పేరుతో ఎవరూ ఎవర్నీ కించపరచరు. అందరూ పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. అదే ఊరిలో ఉంటారు. పుట్టి పెరిగినప్పటి నుంచి వారు కలిసే ఉంటున్నారు. వారి మధ్య ఏమైనా జరిగితే అది కులం కారణం కాదు.. ఇతర వ్యవహారాలు కారణం అవుతాయి. కానీ వారికి సంబంధం లేని వారు మాత్రం.. వారి మధ్య కులం వల్ల ఏదో జరిగిందని .. ప్రచారం చేస్తూ రాష్ట్రంపైనే కుట్రలు చేస్తున్నారు.
జనసేనను ఎందుకు పదే పదే కించ పరుస్తారు ?
పవన్ కల్యాణ్ ఓ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. లేనిపోని కులగొడవలతో ఆయనను రెచ్చగొట్టి జనసేన పార్టీని ఓ కులానికి పరిమితం చేసేందుకు ఈ సానుభూతిపరులే ప్రయత్నిస్తున్నారు. వీరి వల్ల జనసేన పార్టీకి ఏమైనా లాభం ఉందో లేదో కానీ.. వైసీపీ స్ట్రాటజీని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కూటమి మధ్య విబేధాలను సృష్టించాలన్న వైసీపీ లక్ష్యం కోసం వీరు నిరంతరం పని చేస్తున్నారు. ప్రతి దానికి కులం కోణం అంటించి..ఏదో జరిగిపోతోందని రాజకీయం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరు లాభపడతారో.. ఎవరు నష్టపోతారో అందరికీ తెలుసు. ఈ ప్రచారం చేసే వారికీ తెలుసు. అయినా సరే వారి టార్గెట్ వారిదే. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.