హైదరాబాద్ కాదు…హలీమాబాద్!

గత కొన్ని రోజులుగా సాయంత్రాల్లో హలీం ఘుమఘుమలతో హైదరాబాద్ సందడిగా మారింది. రంజాన్ మాసంలో హలీం అమ్మకం భారీగా జరిగే నగరం హైదరాబాదే. `ఈ నెల రోజుల్లో హైదరాబాదులో జరిగే హలీం వ్యాపారం విలువ రూ. 500 కోట్ల పైమాటే. ఎందుకంటే, నిరుడు సుమారు 500 కోట్ల వ్యాపారం జరిగిందట.

నగర వ్యాప్తంగా గత ఏడాది 6 వేల చోట్ల హలీం అమ్మకాలు జరిగాయి. ఈసారి ఈ సంఖ్య మరో 500 పెరిగిందని అంచనా. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బట్టీల్లో హలీం తయారు చేస్తారు. ఉదయం నుంచే హలీం తయారీ, దానికి దినుసులు సమకూర్చడం, వండి వడ్డించడం వంటి పనులకు దాదాపు 30 వేల మందికి మంచి ఉపాధి. హలీం తయారు చేసే వారికి డిమాండ్ భారీగానే ఉంటుంది. వారికి ఈ నెల రోజులకే లక్ష రూపాయలకు పైగా జీతం, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. హలీం అంటే హైదరాబాదీ హలీం అని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. హైదరాబాదీ బిర్యానీతో పోటీ పడుతూ హలీం బ్రాండ్ ఇమేజి పెరగుతోంది. అరబ్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చిన హలీం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. హైదరాబాద్ లో తయారయ్యే హలీలంలో దాదాపు 30 శాతం ఎగుమతి అవుతోంది. దాదాపు 50 దేశాల వారు హైదరాబాదీ హలీంను ప్రత్యేకంగా విమానాల్లో తెప్పించుకుని ఆరగిస్తున్నారు. వీటిలో అరబ్ దేశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన ప్యాక్ లలో పిస్తా హౌస్ వంటి కంపెనీలు గల్ఫ్ దేశాలకు భారీగా హలీం ఎగుమతి చేస్తున్నాయి. హైదరాబాద్ సే హలీం ఆయా క్యా అని ఎమిరేట్స్ తదితర దేశాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తారట. ఏరోజుకు ఆరోజు స్పెషల్ గా పంపిన ఘుమఘుమ లాడే హలీంను లాగించేస్తేనే వారికి రోజు గడిచినట్టు.

ఎగుమతి చేసే హలీం మరింత స్పెషల్ గా ఉంటుంది. ప్యాకింగ్ మొదలు అన్నింటా ప్రత్యేకతే. మంచి రుచి ఉంటే చాలు, ధర ఎంతైనా పరవాలేదనుకునే అరబ్ షేక్ ల కోసం అదిరిపోయే హలీం ను ఎగుమతి చేస్తోంది హైదరాబాద్. ఈ నెలలో ఎగుమతయ్యే హలీం ద్వారా హైదరాబాదీ వ్యాపారులు పొందే ఆదాయం 200 కోట్ల రూపాయల పైమాటే అని ఓ అంచనా. ఒక్క నెలలో ఇన్ని వందల కోట్లు, అదీ ఒక వంటకంపై ఎగుమతి చేయడం అత్యంత అరుదైన విషయం. హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. భాగ్యనగరానికి వచ్చిన మాంసాహారులు బిర్యానీ తినకుండా తిరిగివెళ్లడం అరుదు. రంజాన్ మాసంలో మాత్రం హలీం డామినేషన్ తో బిర్యానీ విక్రయాలు కాస్త తగ్గుతాయని ఇరానీ కేఫ్ ల యజమానులు చెప్తున్నారు. సాయంత్ర 7 గంటల నుంచి తెల్లవారు జాము వరకూ తళతళలాడే లైట్ల వెలుతురులో హలీం వ్యాపారం ధగధగలాడుతుంది. మరో పది రోజుల వరకూ ఇదే సందడి. అయితే ఈద్ తర్వాత కూడా ఈ ప్రభావం కొన్ని రోజులు ఉంటుంది. కనీసం 10, 15 రోజుల పాటు హలీం విక్రయాలు కొనసాగుతాయి. ఆ తర్వాత హలీంకు సలాం చెప్పేస్తే ఇక బిర్యానీని ఓ పట్టుపట్ట వచ్చు.

మళ్లీ వచ్చే ఏడాది మరింత ఘుమఘుమలాడే హలీం కోసం ఎదరు చూస్తూ గడిపేయాల్సిందే. హలీం అంటే హైదరాబాద్ అని ముద్రపడిపోవడం హైదరాబాదీలకు గర్వకారణం. అందుకే హైదరాబాద్ ను హలీమాబాద్ అని ముద్దుగా పిలుచుకున్నా ఆనందమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com