హైదరాబాద్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో జరిగిన అగ్నిప్రమాదం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ విభాగం పూర్తిగా దగ్ధమవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్, గతంలో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసులకు సంబంధించిన అత్యంత కీలకమైన డిజిటల్ సాక్ష్యాలు, ఆడియో రికార్డింగ్‌లు ఈ ల్యాబ్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కీలక సాక్ష్యాలన్నీ కాలిపోయాయన్న ప్రచారం జరుగుతోంది.
పోలీసులు ధృవీకరించడం లేదు కానీ.. కీలక కేసుల సాక్ష్యాలు కాలిపోయాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, నిందితుల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణ ప్రక్రియ ప్రస్తుతం ఈ ల్యాబ్‌లోనే కొనసాగుతోంది. అలాగే, ఓటుకు నోటు కేసులో కీలకమైన వాయిస్ శాంపిల్స్ నివేదికలు కూడా ఇక్కడే భద్రపరిచినట్లు సమాచారం. అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు చెలరేగడం, ఇతర విభాగాల కంటే డేటా సెంటర్ ఉన్న ప్రాంతంలోనే నష్టం ఎక్కువగా జరగడంతో.. సాక్ష్యాలను రూపుమాపడానికి ఎవరైనా కావాలనే ఈ ప్రమాదానికి పాల్పడ్డారా? అనే కుట్ర కోణం పై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
సాక్ష్యాలు బుగ్గిపాలు కావడం వల్ల ఈ ప్రతిష్టాత్మక కేసుల విచారణ గందరగోళంలో పడే అవకాశం ఉంది. డిజిటల్ డేటాకు బ్యాకప్ లేకపోతే, నేరస్తులను కోర్టులో బోనులో నిలబెట్టడానికి అవసరమైన శాస్త్రీయ ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. క్లూస్ టీమ్ ,ఐటీ నిపుణులు కాలిపోయిన హార్డ్ డిస్క్‌ల నుంచి కనీసం కొంత సమాచారాన్నైనా రికవరీ చేయగలమా అనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
