పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు హైదరాబాద్ నగరంలోని సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో, నగరవ్యాప్తంగా వంట గ్యాస్ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వేలాది హాస్టళ్లు, మెస్‌లు , చిన్న హోటళ్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. పెద్ద హోటళ్లు చాలా వరకూ మూతపడ్డాయి.
కుంచించుకుపోయిన హోటల్ మెనూ
గ్యాస్ కొరత కారణంగా నగరంలోని హోటళ్లు తమ మెనూను భారీగా తగ్గించుకుంటున్నాయి. వడ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి ఎక్కువ గ్యాస్ వినియోగించే పదార్థాల తయారీని చాలా హోటళ్లు నిలిపివేశాయి. సిలిండర్ల సరఫరా 75 శాతం పడిపోయింది, ఉన్న స్టాక్ ఒకటి రెండు రోజులు మాత్రమే వస్తుంది అని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల దోశ, ఇడ్లీ వంటి పదార్థాలపై 10 నుండి 15 రూపాయల అదనపు భారాన్ని మోపుతూ గ్యాస్ కొరత వల్ల ధరలు పెంచాము.. సహకరించండి అని నోటీసులు ప్రదర్శిస్తున్నారు.
హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు
నగరంలో విద్యార్థులు, బ్యాచిలర్లు ఎక్కువగా ఉండే అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 11,000 హాస్టళ్లలో భోజనం తయారీకి గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో చాలా హాస్టళ్లలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నిలిపివేసి కేవలం రొట్టెలు లేదా ఉప్మా వంటివి మాత్రమే పెడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 3000 రూపాయలు పలుకుతున్నా దొరకని పరిస్థితి నెలకొంది.
ప్రత్యామ్నాయం లేక బంద్ దిశగా
చిన్నపాటి టిఫిన్ సెంటర్లు , రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఇండక్షన్ స్టౌలు , కట్టెల పొయ్యిలను వాడటం భారీ స్థాయిలో వంట చేసే వారికి సాధ్యం కావడం లేదు. మార్చి 15 నాటికి సరఫరా మెరుగుపడకపోతే, తెలంగాణలోని 90 శాతం హోటళ్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుందని హోటల్ యజమానుల సంఘం చెబుతోంది. ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో హోటళ్లు, హాస్టళ్లకు సమస్యగా మారింది. ఇంటి వద్ద వండుకునే వీల్లేని బ్యాచిలర్లు, ఉద్యోగులు ఇప్పుడు ఆహారం కోసం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గి, దిగుమతులు పునరుద్ధరణ జరిగే వరకు ఈ గ్యాస్ గండం తప్పేలా లేదు.


