హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో నగరంలో ఐదు సంచలన హత్యలు జరిగాయి. ఇద్దరు రియల్టర్ల హత్యలు, ఒక యువతి గొంతు కోసిన దారుణం చోటు చేసుకున్నాయి.కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో సంచలనాత్మక నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఆవేశంలో జరిగే నేరాలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోవచ్చు కానీ పాత నేరస్తులు ప్లాన్ చేసి మరీ హత్యలకు పాల్పడుతూంటే.. ఆపలేకపోవడం మాత్రం పోలీసుల వైఫల్యం అవుతుంది.
వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువ హత్యలు
ఇటీవలి హత్యలన్నీ వ్యక్తిగత శత్రుత్వాలు, ప్రేమ వైరాలు, ఆస్తి వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. డిసెంబర్ 11న ముషీరాబాద్‌లో 17 ఏళ్ల పవిత్రను కత్తితో పొడిచి చంపిన యువకుడు ఆమెకు దగ్గరి బంధువే. డిసెంబర్ 3న యాకుత్‌పురలో రియల్టర్ జునైద్‌ను హత్య చేసిన వారు ఆస్తి వివాదంలో ఉన్న కుటుంబ సభ్యులే. ఈ రకమైన పరిచయస్తుల చేతుల్లోనే ఎక్కువ మంది హతమవుతున్నారు. వ్యాపార వివాదాలతో మరికొంత మంది శత్రువుల్ని చంపడానికి వెనుకాడటం లేదు.
పాతికేళ్ల పగతో రియల్టర్ హత్య
తన తండ్రి ఎన్ కౌంటర్ కు.. ఓ వ్యక్తి కారణం అని అతని కొడుకు గుర్తుంచుకుని పాతికేళ్ల తర్వాత ఆ వ్యక్తిని చంపేశాడు. ఈ వ్యవహారం సంచలనం అయింది. ఇలాంటి ప్లాన్డ్ మర్డర్స్ విషయంలో పోలీసులు చురుగా ఉండలేకపోతున్నారు. పాతనేరస్తులపై నిఘా తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
వేగంగా స్పందిస్తున్న పోలీసులు
సంచలన హత్య కేసుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డంప్ డేటా, డిజిటల్ ఎవిడెన్స్‌తో కేసులు వేగంగా ఛేదిస్తున్నారు. కానీ నేరంగా జరిగిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా..నేరం చేయాలంటేనే నేరస్తులు భయపడేలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే క్రైమ్ రేట్ పెరుగుతుంది. యాథేచ్చగా ప్రతీకారాలు తీర్చుకునే పరిస్థితి ఉందని అనుకుంటే నేరమనస్థత్వం ఉన్న వారికి ధైర్యం వస్తుంది.
రియల్ ఎస్టేట్ వివాదాల్లో రౌడీషీటర్ల పాల్గొనడం, మహిళలపై లైంగిక నేరాలు, పిల్లలపై పోక్సో కేసులు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి గొడవల్లో రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమేయం, ఆ తర్వాత పోలీసు బదిలీలు ఇవన్నీ ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నాయి. పోలీసులు శాంతిభద్రతల అంశంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయం సామాన్య ప్రజల నుంచి వస్తోంది.
