హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రం 2025లో సమూలంగా మారిపోయింది. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, నగరంలో ఇళ్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఖరీదైన ఇళ్లకు ఉన్న డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం విక్రయాలు 2 శాతం మేర తగ్గి 75,222 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, అమ్మకాల సంఖ్య తగ్గినా మార్కెట్ విలువలో మాత్రం భారీ వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా సంపన్న వర్గాల నుంచి వస్తున్న ఆదరణతో హైదరాబాద్ రియాల్టీ రంగం లగ్జరీ వైపు పరుగులు తీస్తోంది.
నగరంలో సామాన్యుడికి సొంతింటి కల మరింత భారంగా మారుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ. 50 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల అమ్మకాలు ఏకంగా 9 శాతం మేర పడిపోయాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, భూముల ధరలు సామాన్య, మధ్యతరగతి వర్గాలను ఇళ్ల కొనుగోలుకు దూరం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన గృహ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడంతో, మధ్యతరగతి ప్రజలు తమ గృహ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి భిన్నంగా, కోటి రూపాయలకు పైబడిన లగ్జరీ ఇళ్ల విభాగంలో మాత్రం విపరీతమైన జోరు కనిపిస్తోంది. ఈ కేటగిరీలో రిజిస్ట్రేషన్లు 35 శాతం మేర పెరగడం గమనార్హం. మార్కెట్లో అమ్ముడవుతున్న ఇళ్లలో కేవలం 20 శాతం ఉన్న ఈ ఖరీదైన ఇళ్లే, మొత్తం మార్కెట్ విలువలో 50 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే, సంఖ్య కంటే విలువే ప్రామాణికంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఈ ధోరణికి కేంద్రబిందువులుగా మారాయి.
ముఖ్యంగా కోకాపేట్, కొండాపూర్, పుప్పాలగూడ, నానక్‌రాం గూడ, నార్సింగి ,గగన్‌పహాడ్ వంటి ప్రాంతాల్లో కోటి రూపాయలకు పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి. అత్యాధునిక వసతులు, విశాలమైన విల్లాలు , హై-రైజ్ అపార్ట్మెంట్లకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మొత్తం మీద, హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు సామాన్యుడి అందుబాటు నుంచి క్రమంగా చేజారి, సంపన్నుల అడ్డాగా మారుతోందనే విశ్లేషణలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది.
