హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపిస్తోంది. కానీ నిర్మాణాలు మాత్రం భవిష్యత్ లో ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుందన్న అంచనాతో జరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 2025 మొదటి ఆరు నెలల్లో 922 లేఅవుట్ , ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. ఈ సంఖ్య సంవత్సరాంతానికి డబుల్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వేగవంతమైన అప్రూవల్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన బూమ్‌ను సూచిస్తున్నాయి. ఐటీ కారిడార్ తో పాటు ఘట్కేసర్, శంషాబాద్, శంకరపల్లి, మెడ్చల్ వంటి ప్రాంతాల్లో బిల్డర్లు ఎక్కువగా అనుమతులు తీసుకుంటున్నారు.
ఈ అప్రూవల్స్ ట్రిపుల్ ఆర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ ప్లాన్లు, మెట్రో ఫేజ్-II, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు వంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్‌గా మార్చుతున్నాయి. పెద్ద లేఅవుట్లు , కొత్త ప్రాజెక్టులు నగరం వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని రియల్ వర్గాలు చెబుతున్నాయి.
అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి 1,800కి పైగా అప్రూవల్స్ రావచ్చు, ఇది రియల్ ఎస్టేట్ రంగం ఆశావహ పరిస్థితిని సూచిస్తోంది. ధరలు విపరీతంగా పెరగకుండా.. మధ్యతరగతికి అందుబాటులోకి వస్తే.. రియల్ ఎస్టేట్ రంగం ఆశించి డిమాండ్ చాలా సులువుగానే ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి.