చిన్న సినిమాలకు టీజర్, ట్రయిలర్ కట్ చేయడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాలో మంచి పాటలు ఉండడం కూడా అంతే ముఖ్యం. ఒక్క హిట్ పాట బయటకు వచ్చినా చాలు, కోట్ల రూపాయల పబ్లిసిటీ దొరికినట్టే. అందుకే చిన్న సినిమాలు పాటలపై బాగా ఫోకస్ చేశాయి. టైటిల్, గ్లింప్స్, పోస్టర్స్ వీటిలో కొత్తదనం చూపించుకొంటూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్న సినిమాల్లో ‘దివానా’ ఒకటి. హర్షిత్, స్మిహా జంటగా నటించారు. ఈ సినిమా నుంచి `ఇది ప్రేమ` అనే పాటని ఈరోజు విడుదల చేశారు. కార్తిక్ ఈపాటని ఆలపించాడు. ఈశ్వర్, చైతన్య పింగళి రాశారు. ఈశ్వర్ స్వరాన్ని సమకూర్చారు.
పాట వినగానే మనసుకు హత్తుకొనేలా ఉంది. కార్తిక్ గొంతులో మెలోడీ ఇంకా మధురంగా మారిపోతుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరిగింది. చాలా కాలం తరవాత కార్తిక్ పాడిన పాటల్లో చెప్పుకోదగినదిగా ‘ఇది ప్రేమ’ నిలిచిపోతుంది. పిక్చరైజేషన్ కూడా కూల్ గా ఉంది. ఈ కొత్త జంట యూత్ ని థియేటర్లకు రప్పించగలదు అనిపిస్తోంది. శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమాలు ఈమధ్య మంచి ఫలితాల్ని అందుకొంటున్నాయి. పైగా ఇది ప్రేమ కథ. గ్లింప్స్ లో వైవిధ్యం కనిపించింది. ఇప్పుడు పాటలూ మనసుని హత్తుకొంటున్నాయి. సో… ప్రేక్షకుల ఈ సినిమాపై ఫోకస్ పెట్టొచ్చు.
