లెజెండరీ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు బలూచిస్థాన్ విదేశాంగ శాఖ ‘ఎక్స్’ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన లెజెండరీ క్రికెటర్ కూడా కావడంతో పలు మీడియా సంస్థలు, క్రికెట్ అభిమానులు పెద్దఎత్తున పోస్టులు చేశారు. ఒక క్రికెట్ లెజెండ్ ని కోల్పోయమని సంతాపాలు కూడా ప్రకటించారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్లు వస్తున్న వార్తలను రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైంది’’ అంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఇటీవల జైలు వద్దకు వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు.
తాజాగా ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ‘మా నాన్నకు ఏం జరిగినా దానికి పాక్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి చెందిన ఆస్తులు, భూముల అక్రమ డీల్, పదవిలో ఉన్నప్పుడు న్యాయ విరుద్ధంగా లాభాలు పొందిన కేసులు, అల్-ఖాదిర్ ట్రస్ట్‌కు సంబంధించిన అవినీతి, దేశానికి చెందిన రహస్య పత్రాలు లీక్ చేశారనే కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత నెలన్నర రోజుల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్’లో ఒంటరిగా నిర్బంధించారనే కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఒక లెజెండరీ క్రికెటర్, దేశ మాజీ ప్రధాని అసలు ప్రాణాలతో వున్నారో లేదో తెలియకపోవడం శోచనీయం.