యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. సైనిక చర్య తీసుకోవాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నా, ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోరాదని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ముందు దౌత్య పరంగా, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను పూర్తి ఏకాకిగా మార్చాలని తీర్మానించారు. ఐక్యరాజ్య సమతి సాక్షిగా ఈ ప్రయత్నం ఫలించింది.
ఐరాస లో పాక్ ప్రధాని కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన కొన్ని గంటలకే, భారత్ భీకరమైన ఎదురుదాడి చేసింది. పాకిస్తాన్ ఓ ఉగ్రదేశమని సమితి సర్వసభ్య సమావేశాల్లో స్పష్టంగా చెప్తూ సాక్ష్యాధారాలను ఉటంకించింది. ఉగ్రవాదానికి పాక్ గడ్డ ఐవీ లీగ్ గా మారిందనే సత్యాన్ని ప్రపంచం కళ్లకు కట్టింది.
ఐరాసలో భారతీయ శాశ్వత బృందం ఫస్ట్ సెక్రటరీ- ఈనాం గంభీర్ తన ప్రసంగంలో పాక్ పై సునిశిత దాడి చేశారు. ఇటీవల ఎన్ కౌంటర్లో హతమైన ఉగ్రవాది బుర్హాన్ వనీని ఓ నాయకుడిగా నవాజ్ షరీఫ్ కీర్తించడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశమని నిండు సభలో ప్రకటించారు. దక్షిణాసియా అంతటా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మానవత్వానికి సవాలుగా మారిందన్నారు.
ఐరాసలో పాక్ ఈ స్థాయిలో ఏకాకి కావడం ఇదే మొదటిసారి. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలిచినా చైనా ఆదుకోవడానికి ఆగమేఘాల మీద ముందుకొస్తుందని పాక్ నమ్మకం. ఎందుకో ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. సమితితో పాక్ ప్రధానికి మరో చేతు అనుభవం ఎదురైంది. కాశ్మీర్లో భారత ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి మాన్ కీ మూన్ కు వివరాలను, అంటే డోసియర్ ను ఇవ్వడానికి షరీఫ్ ప్రయత్నించారు. కానీ మూన్ తిరస్కరించారు. కాశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. అది అంతర్జాతీయ అంశం కాదని తేల్చిచెప్పారు.
పాకిస్తాన్ పై పరిమిత యుద్ధం చేయాలని పలువురు సెలెబ్రిటీలు, సామాన్య ప్రజలతో పాటు రిటైర్డ్ సైనికులు కోరుతున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఏకాకి అయిన తీరును చూస్తుంటే, భారత్ ఒకవేళ సైనిక చర్యకు దిగినా విమర్శలు వచ్చే అవకాశం లేదు. యావత్ ప్రపంచం భారత్ నే సమర్థించే అవకాశం ఉంది. బహుశా ఈ పరిస్థితిని సృష్టించడానికే మోడీ ప్రభుత్వం సైనిక చర్య విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.