ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాల హవా కొనసాగుతోందని స్పష్టం చేశాయి. గత ఆరు నెలల కిందట జరిగిన సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే, ఓటర్ల నాడిలో పెద్దగా మార్పు రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరగగా, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నట్లు సర్వే విశ్లేషించింది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి క్లీన్ స్వీప్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తిరుగులేదని సర్వే తేల్చింది. కూటమి సుమారు 55 శాతం ఓట్లను కొల్లగొట్టి, రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ 22 నుండి 24 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. గత సర్వేతో పోలిస్తే కూటమి తన ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసుకుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీకి కేవలం ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ ఓట్ల శాతం భారీగా క్షీణించిందని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమి బలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ మధ్యే పోరు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఈ సర్వే స్పష్టం చేసింది. గతంలో మూడు పార్టీల మధ్య పోటీ ఉండగా, ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ ,బీజేపీ మధ్యే నెలకొంది. ఈ రెండు పార్టీలు చెరో 8 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. గత సర్వేలో బీజేపీ కొన్ని స్థానాలకే పరిమితం కాగా, ఇప్పుడు కాంగ్రెస్‌తో సమానంగా బలపడటం విశేషం. ఎంఐఎం తన పాత స్థానమైన హైదరాబాద్‌ను నిలబెట్టుకునే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్‌తో దశాబ్ద కాలం పాలించిన పార్టీ ఓట్ల శాతం ఇప్పుడు దారుణంగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో గగనమని తేల్చింది. గత సర్వేలో కనీసం 2-3 సీట్ల వరకు ఆశలు ఉన్నప్పటికీ, తాజా ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటర్లు పూర్తిగా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది.
గత సర్వేకు ఇప్పటికీ మెరుగుపడిన కూటమి
గత మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో పోల్చి చూస్తే, ఏపీలో ప్రభుత్వ పథకాల అమలు, కూటమి మధ్య సమన్వయం ఓటర్లను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ పెరగడం వల్ల రెండు పార్టీలు సమానంగా నిలిచాయి. బీఆర్ఎస్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోతుండటం ఈ సర్వే ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది.
