టీటీడీ చైర్మన్‌పై తప్పుడు ప్రచారం చేసేందుకు డీప్ ఫేక్ వీడియోలు తయారు చేశారు. అందులో ఉన్న మహిళను ఇందులేఖగా చెప్పారు. ఆమె మీడియా ముందుకు వచ్చి బీఆర్ నాయుడుపై చాలా ఆరోపణలు చేస్తారని వైసీపీ నేతలు వాట్సాప్‌లలో ప్రచారం చేశారు. ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి ఆమె ఎప్పుడో పదేళ్ల కిందట రాసిన లేఖ అంటూ తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కాదని నేరుగా ఆ ఇందులేఖ అనే మహిళే రంగంలోకి దిగి హైదరాబాద ్లోని రాయదుర్గం పోలీసులుక ఫిర్యాదు చేశారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి తన వీడియోలను అభ్యంతరకరంగా మార్చారని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే తాడేపల్లి ఇందులేఖ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ప్రతిష్టకు భంగం కలిగించేలా విదేశాల నుంచి , దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ అకృత్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ప్రధానంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోని పలు వివాదాస్పద ఛానళ్లను పోలీసులు గుర్తించారు. దేశాభిమాని , ది న్యూస్ తెలుగు , జగనన్న కనెక్ట్స్ , టీమ్ ప్రశ్న వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ను సర్క్యులేట్ చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోల వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపానికి, మానసిక క్షోభకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్. వెంకన్న నిందితులపై భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సాంకేతికతను అడ్డు పెట్టుకుని మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ ముఠా వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
