వైకాపాలో అంత అభ‌ద్ర‌త నిజ‌మేనా.?

నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్‌… రెండు చోట్లా ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా ఘోర ఓట‌మిని చ‌వి చూసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి, ఈ ఓట‌మినికి వైకాపా ఎలా విశ్లేషించుకుందో అనేది ఎక్క‌డా క‌నిపించ‌లేదు, వినిపించ‌లేదు. పార్టీ నాయ‌కుల్ని, కేడ‌ర్ ఇప్పుడు వైయ‌స్సార్ ఫ్యామిలీ కార్య‌క్ర‌మంవైపు మ‌ళ్లించేశారు జ‌గ‌న్‌. ఆ కార్య‌క్ర‌మం ఇప్పుడు మొద‌లుకాబోతోంది. అయితే, ఇదే త‌రుణంలో వైకాపా నుంచి చాలామంది త‌మ‌తో ట‌చ్ లో ఉంటున్నార‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదంటూ టీడీపీ నుంచి క‌వ్వింపు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఖాళీ అయ్యేది టీడీపీయే అంటూ వైకాపా నేతల కౌంట‌ర్లు కూడా ప‌డుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఓవారం పాటు జ‌గ‌న్ లండ‌న్ టూర్ కి వెళ్తున్నారు. త‌న కుమార్తెను లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో చేర్చేందుకు కుటుంబ స‌మేతంగా ఆయ‌న బ‌య‌లుదేరుతున్నారు.

లండ‌న్ నుంచి జ‌గ‌న్ తిరిగి వ‌చ్చే స‌మయానికే ఒక‌రిద్ద‌రు వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ అయ్యే అవ‌కాశాలున్నాయంటూ పార్టీ శ్రేణుల్లోనే ఆందోళ‌న వినిపిస్తోందంటూ ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నంద్యాల‌, కాకినాడ ఫ‌లితాల అనంత‌రం ఇంకా వైకాపాలోనే కొన‌సాగితే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే స్ప‌ష్ట‌తకు కొద్దిమంది నేత‌లు వ‌చ్చేశార‌నీ, జ‌గ‌న్ లేని స‌మ‌యం చూసి టీడీపీతో వారంతా ట‌చ్ లోకి వెళ్లే అవ‌కాశాలున్నాయంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఇంత‌కీ వైకాపాలో నిజంగానే ఇలాంటి ప‌రిస్థితి ఉందా..? లేదంటే, ఎలాగూ జ‌గ‌న్ లండ‌న్ వెళ్తున్నారు కాబ‌ట్టి.. వైకాపాలో మ‌రింత గంద‌ర‌గోళాన్ని సృష్టించడానికి అనువుగా ఈ స‌మ‌యాన్ని మార్చుకోవాల‌నే ఉద్దేశంతోనే ఇలాంటి పుకార్లను వేరే ఎవ‌రైనా పెంచి పోషిస్తున్నారా అనేది కూడా అనుమాన‌మే. ఏదేమైనా, ఇలాంటి చ‌ర్చ ఒక‌టి తెర‌మీదికి రావ‌డం ఆస‌క్తిక‌రంగానే ఉంది.

నిజానికి, నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల వైఫ‌ల్యాల‌పై వైకాపాలో శాస్త్రీయ‌మైన చ‌ర్చ అంటూ ఏదీ జ‌ర‌గ‌లేదనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉంది కాబ‌ట్టి, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి, పెద్ద ఎత్తున సొమ్మును వెద‌జ‌ల్లి గెలిచేసింద‌ని సంతృప్తిప‌డ్డారు. పార్టీ శ్రేణులకు కూడా అదే కారణం చెప్పేసి ఊరుకున్నారు. అంతేగానీ.. పార్టీప‌రంగా ఉన్న లోపాలేంట‌నేవి స‌రిగా చ‌ర్చించ‌లేద‌న్న అభిప్రాయం కొంత‌మంది వైపీసీ నేత‌ల్లో ఉంద‌నీ, దాని గురించి జ‌గ‌న్ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారిలో విశ్వాసం స‌న్న‌గిల్లుతోంద‌నీ, అలాంటివారిని టీడీపీ సులువుగా ఆక‌ర్షిస్తుందంటూ ఒక వైకాపా నేత మీడియా మిత్రుల‌తో ఆఫ్ ద రికార్డ్ వాపోయార‌ట‌! కాబ‌ట్టి, వ‌ల‌స‌లు అనేవి ఖాయ‌మ‌నీ, అది జ‌గ‌న్ లండ‌న్ టూర్ లో ఉన్న‌ప్పుడు కావొచ్చు, త‌రువాత కూడా కావొచ్చ‌ని ఆయ‌న తేల్చేశార‌ట‌! మొత్తానికి, ఆయ‌న లండ‌న్ వెళ్లొచ్చే వ‌ర‌కూ నాయ‌కుల‌పై నిఘా నేత్రం ఉంటుంద‌న్న‌ది మ‌నం అర్థం చేసుకోవాల్సిన విష‌యం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.