ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని తెలుసు.. కానీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. టీడీపీ యువనేతలు ఆన్‌లైన్ ఉద్యమం చేస్తున్నారన్న కారణంగా… ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వానికి చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. ఐదో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవనుండగా… తాజాగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని.. వారి తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారని.. ఈ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లుగా మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. హైకోర్టు అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.
పరీక్షల నిర్వహణ అంశంపై పునంపరిశీలించాలని హైకోర్టు రెండు రోజుల కిందట ప్రభుత్వానికి సూచించింది. ఏ విషయాన్ని మూడో తేదీలోపు చెప్పాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సీఎం జగన్ విద్యా శాఖ సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని.. కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు హాల్ టిక్కెట్ వెనుక కోవిడ్ జాగ్రత్తలను ముద్రించింది. దీంతో హైకోర్టును కూడా… ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమయింది.
అయితే ఏం జరిగిందో కానీ… ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరుతామన్న ప్రభుత్వం హఠాత్తుగా వెనక్కి తగ్గింది. ఆదివారం పూట హడావుడిగా పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నది ఇదే. మొదట్లోనే ఈ నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు టెన్షన్ తప్పేది. కానీ ప్రభుత్వ పెద్దలు లేనిపోని పట్టుదలలకు పోవడంతో… చివరి క్షణంలో వాయిదా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. టెన్త్ పరీక్షలు వచ్చే నెల జరగాల్సి ఉంది. వాటి గురించి ఇప్పుడే ప్రకటనలు చేయలేదు. బహుశా… టెన్త్ పరీక్షలకు ఒకటి.. రెండు రోజుల ముందు ప్రకటించే అవకాశం ఉంది.